పిల్లి జూనియర్.. తండ్రి లాగే తిరుగుబాటు!

Wednesday, January 22, 2025

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే నియోజకవర్గం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పేలా కనిపించడం లేదు. గతంలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తిరుగుబాటు చేసి ఇండిపెండెంటుగా పోటీచేసిన నెగ్గిన పిల్లి సుభాష్ చంద్రబోస్ బాటలోనే ఆయన తనయుడు కూడా నడుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాల్సిందిగా తమ అనుచరులు కోరుతున్నారని.. అయితే పార్టీ తరఫున పోటీచేస్తానా లేదా ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతానా అనేది త్వరలో తేలుతుందని పిల్లి సూర్యప్రకాష్ ప్రకటిస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుచరులందరూ కలిపి ఓ పెద్ద మీటింగు పెట్టుకుని.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే గనుక.. ఖచ్చితంగా ఓడించి తీరుతాం అని తిరుగుబాటు ప్రకటించిన నేపథ్యంలో.. వారికి తెరవెనుకనుంచి నేతృత్వం వహించిన పిల్లి సూర్యప్రకాష్ తన మనోగతం బయటపెట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనేక నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునే విషయంలో ముఠా తగాదాలు పెచ్చరిల్లుతున్నాయి. వాటిలో అనేక మంత్రుల నియోజకవర్గాలు కూడా ఉండడం గమనార్హం. సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుకు కూడా సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి వర్గం తయారైంది. అంబటికి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తాం అని వారు అంటున్నారు. మంత్రి రోజా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. నగరి నియోజకవర్గంలోని మరో మంత్రి పెద్దిరెడ్డి వర్గీయులు ఆమెను ఓడించడానికి ఇప్పటినుంచే సిద్ధం అవుతున్నారు. నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సొంత బాబాయి సారథ్యంలో వైసీపీ నాయకులే ఇప్పుడు శత్రువులుగా తయారయ్యారు. వీరి మధ్య జగన్ స్వయంగా రాజీ ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించినట్టుగా లేదు. రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణ కు కూడా గడ్డురోజులు తప్పేలా కనిపించడం లేదు.
మంత్రి వేణు తమ వర్గానికి చెందిన కార్యకర్తల మీద బలవంతంగా పోలీసు కేసులు పెట్టిస్తున్నారని, వేదిస్తున్నారని పిల్లి సూర్యప్రకాష్ ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపణలను జగన్ చెవిన వేసుకుంటారా? లేదా, ఇలాంటి తిరుగుబాటును, అంతర్గత వ్యవహారాలను రచ్చకీడ్చే వైఖరిని సహించేది లేదని ఆగ్రహిస్తారా? అనేది అర్థం కావడం లేదు. అయితే అధినేత జగన్ కు కోపం వస్తుందనే జంకు లేకుండానే.. నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ఎక్కడికక్కడ చెలరేగిపోతూఉండడం గమనించాల్సిన సంగతి.
వైఎస్ఆర్ హయాంలో ఇంచుమించుగా ఇదే జరిగింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పార్టీ టికెట్ లభించలేదు. వైఎస్సార్ కు ఆయన సన్నిహితుడే అయినప్పటికీ.. రకరకాల సమీకరణాల వల్ల టికెట్ ఇప్పించలేకపోయారని ప్రచారం జరిగింది. ఆయన ఇండిపెండెంటుగా గెలిచిన తర్వాత.. వైఎస్ఆర్ నేతృత్వంలోనే తిరిగి పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా పార్టీ టికెట్ రాకపోతే కొడుకు సూర్యప్రకాష్ ఇండిపెండెంటుగా పోటీచేస్తా అంటున్నారు. మరి ఆశీస్సులు కూడా ఉంటాయో లేదో తెలియదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles