పిల్లికి జగన్ క్లాస్.. ఇండిపెండెంటుగానే జూనియర్ పిల్లి!

Monday, September 16, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలం.. తిరుగుబాటు దిశగానే పయనిస్తోందా? తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కనీసం సీఎం జగన్ కు సమాచారం కూడా లేకుండా.. ఒక్కసారిగా పెల్లుబికిన అసంతృప్తిని బుజ్జగించడంలో జగన్ విఫలం అవుతున్నారా? రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ తిరుగబాటు అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీచేయడానికి డిసైడ్ అయ్యారా? అనే చర్చలు ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. పిల్లి తండ్రీ తనయుల వైఖరిపై జగన్మోహన్ రెడ్డి కూడా అసహనానికి గురయ్యారని, అందుకే పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తాడేపల్లికి పిలిపించి క్లాస్ తీసుకున్నారని చర్చ జరుగుతోంది.

ఎంపీకి, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మొంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మధ్య విభేదాలు ఉన్నాయి. పిల్లి వర్గానికి చెందిన నాయకులను మంత్రి తొక్కేస్తున్నారని, వారిని పట్టించుకోవడం లేదని స్థానికంగా అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో వారు ఓ సమావేశం పెట్టుకుని మంత్రి వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ప్రకటించారు. తర్వాతి రోజున పిల్లి వర్గం నాయకుడు శివాజీ పై మంత్రి సమక్షంలోనే ఆయన అనుచరుడు చేయి చేసుకోవడం వీరి మధ్య విభేదాల్ని పెంచింది. పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయడం అనేది గ్యారంటీ అని, పార్టీ టికెట్ మీద పోటీచేస్తానా? లేదా, ఇండిపెండెంటుగానా? అనేది ఇంకా తేలలేదని ప్రకటించారు. ఇది ఖచ్చితంగా జగన్  మీద తిరుగుబాటు ప్రకటించడమే అని పార్టీ భావిస్తోంది.

దాంతో జగన్ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి విభేదాలు ఎన్ని నియోజకవర్గాల్లో బయటపడుతున్నా.. జగన్ చాలా తక్కువ సందర్భాల్లోనే స్వయంగా జోక్యం చేసుకుంటున్నారు. తొలివిడత చర్చలను ఇతరులకు అప్పగిస్తున్నారు. అయితే.. పిల్లి సుభాష్ చంద్రబోస్ తన తండ్రి వైఎస్సార్ కు సన్నిహితుడు కావడంతో.. జగన్ స్వయంగా ఆయనను పిలిపించినట్టు తెలుస్తోంది. కొడుకును వారసుడిగా రాజకీయాల్లోకి తేవాలని ఉంటే.. ముందుగా తనతో ఓ మాట చెప్పి ఉండాలి కదా అని జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు ఎలాంటి మాట కూడా చెప్పకుండా.. ఒకేసారి తిరుగుబాటు మీటింగులు పెట్టడం పార్టీ ప్రతిష్ఠకు దెబ్బ అని అన్నట్టు సమాచారం. మంత్రి వేణుకు టికెట్ ప్రకటించిన తర్వాత.. ఇలాంటి పనులు తగవని అన్నట్టు తెలుస్తోంది.

జగన్ మాటల ద్వారా.. టికెట్ వేణుకు మాత్రమే అని తేలిపోవడంతో.. పిల్లి సూర్యప్రకాష్ ఇండిపెండెంటుగా బరిలోకి దిగడానికే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన తన సన్నిహితులతో ఈమేరకు అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే తొందరపడి ప్రకటనలు చేయకుండా కొన్నాళ్లు మౌనం పాటించి.. ఎన్నికల నాటికి రంగంలో ఉంటారని అంటున్నారు. స్వతంత్రంగానే బరిలో ఉంటారా? విపక్షాలతో చేయి కలుపుతారా? అనేది మాత్రం క్లారిటీలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles