ముద్రగడ పద్మనాభం అప్పుడప్పుడూ వార్తల్లో వ్యక్తిగా హాట్ హాట్ గా మెరిసి తర్వాత మాయం అవుతుంటారు. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేయడం ద్వారా ఆయన వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. తనకు సంబంధంలేని వివాదంలో తలదూర్చి ముద్రగడ ఒకవైపు పవన్ అభిమానులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పవన్ అభిమానులతో తనను తిట్టిస్తున్నారంటూ.. ముద్రగడ పవన్ కల్యాణ్ కు మరొక లేఖ రాయడం విశేషం. ఆ లేఖలోని ఇతర విషయాలు ఎలా ఉన్నా సరే.. ‘‘ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద కాకినాడలో పోటీచేయడానికి ధైర్యం లేకపోతే.. పవన్ కల్యాణ్ దమ్ముంటే పిఠాపురంలో తనమీద పోటీచేయాలని’’ ముద్రగడ పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే.. 2019 ఎన్నికల్లో ఎక్కడా పోటీచేయకుండా మౌనంగా ఉండిపోయిన ఈ కాపునాయకుడు.. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీచేయడానికి కర్చీఫ్ వేసినట్టుగా అర్థమవుతోంది.
ముద్రగడ కోరుకున్నంత మాత్రాన.. అక్కడ పిఠాపురం నియోజకవర్గం ఆయనను అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదా? అనేది ఇప్పుడు కీలక ప్రశ్న. పైగా ముద్రగడ పిఠాపురం నుంచి తాను పోటీచేయబోతున్నట్టు చాలా ధాటిగా ప్రకటించేసుకున్నారు. పవన్ కు సవాలు కూడా విసిరారు. అయితే ఆయన పిఠాపురంనుంచి ఏ పార్టీ తరఫున పోటచేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది.
ఆయన తన వ్యవహార సరళితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు గానీ.. వైసీపీ ఆయనకు పిఠాపురం టికెట్ ఇస్తుందా? అనేది సందేహమే. ఎందుకంటే.. అక్కడ ఆ పార్టీకి సిటింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. మరి సిటింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి ముద్రగడకు వైసీపీ టికెట్ ఇస్తుందా అనేది అనుమానమే. అయితే ముద్రగడ ఇండిపెండెంటుగా అక్కడినుంచి పోటీచేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అలా పోటీచేస్తే నెగ్గుతారా అనే అనుమానం కూడా పలువురిలో ఉంది.
ఎందుకంటే.. 2009లో వైఎస్సార్ హవా పుష్కలంగా ఉన్న రోజుల్లోనే ఆయన ముద్రగడను పిలిచి ప్రత్తిపాడునుంచి పోటీచేయమంటే.. కాదు కూడదు అని కాంగ్రెస్ తరఫున పిఠాపురం టికెట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్ హవాలో కూడా నెగ్గలేకపోయారు. 2014లో తాను గతంలో తెలుగుదేశంలో ఉండగా రెండుసార్లు నెగ్గిన ప్రత్తిపాడు నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో ఆయన ఎన్నికల బరిలోకి దిగలేదు. తీరా ఇప్పుడు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని, దమ్ముంటే తనమీద పోటీచేసి ఓడించాలని పవన్ కల్యాణ్ కు సవాలు విసురుతున్నారు. ఇంతకూ పిఠాపురం మీద ఆయన కర్చీఫ్ వేసుకున్నారు సరే.. అసలు ఏ పార్టీ తరఫున బరిలో ఉంటారు అనేదే చర్చ. వైసీపీ ఆయనను ఆదరిస్తే గనుక.. సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఏం చేస్తుందో చూడాలి.