ఇన్నాళ్లూ ఏపీలోని భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి? 2019 ఎన్నికల్లో ఒక శాతం ఓట్లను సాధించిన పార్టీ ఆ తర్వాత ఏమైనా మెరుగుపడిందా? అనే సందేహాలు పలువురికి కలుగుతూ ఉండొచ్చు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలతో పోల్చి చూసినప్పుడు.. ఏపీలో బిజెపి కార్యకలాపాలు చాలా కనిష్ట స్థాయిలో ఉన్నాయనే చెప్పాలి. అలాగే.. జనసేన పార్టీతో తాము పొత్తుల్లో ఉన్నామని.. ఇద్దరూ కలిసి అధికారంలోకి వస్తామని కమల నేతలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారే తప్ప.. భాగస్వామి పార్టీతో కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఉమ్మడిగా ప్రజల్లో బలపడడానికి వారు చేసిన ప్రయత్నాలు మాత్రం శూన్యం. అలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం మారిన తర్వాత.. కొత్త దశదిశ కనిపిస్తోంది. సోమువీర్రాజును ఒక ఫోన్ కాల్ ద్వారా తొలగించి.. రాష్ట్ర పార్టీ సారథ్యాన్ని పురందేశ్వరి చేతుల్లో పార్టీపెట్టిన తర్వాత.. సరైన మార్గంలో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది.
త్వరంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ తో పురందేశ్వరి భేటీ కాబోతున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం భేటీ మాత్రమే కాదు. ఎన్నికలు ఇంకో ఏడాది దూరంలో మాత్రమే ఉన్న నేపథ్యంలో.. జనసేనతో కలిసి ఉమ్మడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇది బిజెపికి చాలా అవసరం. ఆ పార్టీకి విశ్వసనీయమైన క్షేత్రస్థాయి కార్యకర్తల బలం ఉంది. అయితే కార్యకర్తలే తప్ప.. ఓట్ల బలం లేదు. పవన్ కల్యాణ్ కు అపరిమితమైన జనాదరణ ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి ప్రజాందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి దడ పుట్టించగలవు.
అయితే ఈ నాలుగేళ్లలో కొరవడిన సఖ్యత కూడా అదే. సోము వీర్రాజు సారథ్యంలో.. జనసేనతో కలిసి తాము కార్యక్రమాలు చేయాలని, వారు తాము భాగస్వాములు అనే భావన ఎన్నడూ ప్రజలకు చూపించలేకపోయారు. పవన్ కూడా రాష్ట్ర బిజెపి నాయకులతో ఎన్నడూ కలవకుండా.. వారి వ్యవహారానికి తగ్గట్టుగానే ఉండిపోయారు. బిజెపి సంస్థాగతంగా పార్టీగా బలోపేతం అయ్యేదిశగా ఒక్క అడుగుకూడా ముందుకు పడకుండా ఉండిపోయింది. ఇప్పుడు చిన్నమ్మ పురందేశ్వరి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురానున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తో సమావేశాలకు, జనసేనతో కలిసి ఆందోళనలను నిర్వహించడానికి ఆమె ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే జరిగితే.. రెండు పార్టీలకు ఖచ్చితంగా కొంత మేలు జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. భారతీయజనతా పార్టీని చిన్నమ్మ కరెక్ట్ ట్రాక్ మీదకు తెస్తున్నదని పలువురు అంటున్నారు.