పాయింట్ లేనప్పుడే పర్సనల్ విమర్శలు!

Wednesday, January 22, 2025

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను దోచుకుంటున్నదో.. పరిపాలన ఎంత చెత్తగా ఉన్నదో రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్ సర్కారును గద్దె దించాల్సిన అవసరం ఎంత ఉన్నదో పవన్ కల్యాణ్ తన మాటల్లో ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తారు. దానికి జగన్ పార్టీ నుంచి మంత్రులంతా దడికట్టి మరీ ప్రతివిమర్శలు చేయడానికి పూనుకుంటారు. అయితే వారికి ఏం మాట్లాడాలో తెలియదు.ఏం నిందలు వేయాలో తెలియదు. పవన్ ను విమర్శించడానికి వారివద్ద పాయింట్ ఏమీ ఉండదు. అందరూ ఏమాత్రం పసలేకుండా ఆయన పర్సనల్ జీవితం గురించి మాట్లాడుతుంటారు. ఆ రకంగా ప్రజల దృష్టిలో చీప్ అయిపోతుంటారు.
ఎప్పుడైనా సరే.. ఎవరైనా రాజకీయ విమర్శలు చేసినప్పుడు.. వాటికి జవాబివ్వగల దమ్ము సత్తా ఉన్న నాయకులు భయపడరు. ఆ విమర్శల్లో నిజం లేనప్పుడు అసలు పట్టించుకోరు. అలాంటప్పుడు.. విమర్శల్లో ఏయే పాయింట్లు ప్రస్తావించారో.. వాటికి సమాధానం పాయింట్ ప్రకారంగా చెప్తారు. తమ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగే పద్ధతి.
కానీ.. తమ మీద విమర్శలు వచ్చినప్పుడు ప్రతి విమర్శలు చేయడానికి గతిలేని నాయకులు ఏం చేయగలరు? జవాబు చెప్పడం చేత కాదు. ఏదోటి చెప్పకుండా ఉండలేరు. ప్రజల దృష్టిలో చులకన అయిపోతాం అని భయం. అలాంటి భయంలో.. దిగజారి తమ మీద వచ్చిన నిందలకు జవాబివ్వకుండా, పర్సనల్ విమర్శలకు తెగిస్తారు. అలాంటి చెత్త ప్రయత్నాల వలన ప్రజలు తమను మరింత ఘోరంగా అసహ్యించుకుంటారనే సంగతి వారు గుర్తుంచుకోరు. అందుకే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారు.
తమాషా ఏంటంటే.. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ కు ప్రతి సమావేశం సమయానికి ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ప్రభుత్వం అనేక వైఫల్యాలతో పతనం అవుతుండగా.. ప్రతి సారీ ఆయన తన విమర్శలకు కొత్త అస్త్రాలు జత చేరుస్తూ, ఏ రకంగా జగన్ సర్కారు చేతకానిదని అనుకోవాలో చెబుతుంటారు. కానీ.. ఆయన పర్సనల్ విషయాల మీద ఎటాక్ చేసే వైసీపీ వాళ్లకు మాత్రం గత నాలుగేళ్లుగా ఒక్క కొత్త పాయింట్ కూడా లేదు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు, ఆయనను చూసి యూత్ ఏం నేర్చుకోవాలి.. మూడు పెళ్లిళ్లు చేసుకోవాలనే నీతి నేర్చుకోవాలా అంటూ.. చవకబారు లేకి పలుకులు పలుకుతారే తప్ప.. నిర్మాణాత్మక విమర్శలు చేయడం వారికి చేతకాదు. అవే విమర్శల్ని నాలుగేళ్లుగా రిపీట్ చేస్తుంటారు. నాలుగేళ్లుగా పవన్ ప్రభుత్వ లోపాల్ని ఎత్తిచూపుతుండగా.. అలాంటి లోపాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. అదే సమయంలో.. పవన్ ను నిందించడానికి పెళ్లిళ్లు తప్ప మరో పాయింట్ లేకుండా దిగజారి మాట్లాడుతున్నారు. ప్రజలకే వైసీపీ నాయకుల బుద్ధలు మీద చీదర పుట్టేలా ప్రవర్తిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles