పాపం అవినాష్ రెడ్డి! ఆయన పరిస్థితి ‘అనుకున్న దొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిరో బుల్ బుల్ పిట్ట..’ అన్న సినిమా పాట చందంగా తయారైంది. తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డికి ఆ కోరిక నెరవేరలేదు. ఆ పిటిషన్ సాకుపెట్టి సీబీఐ విచారణకు హాజరు కావడాన్ని కాస్త వెనక్కు నెట్టిన ఆయన ఇప్పుడు ప్రతిరోజూ విచారణకు హాజరు కావాల్సిన అగత్యం ఏర్పడింది. నిజానికి దీనికంటె అరెస్టు కావడమే కాస్త మేలు కదా.. అని చిరాకు పుట్టేంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది.
అవినాష్ రెడ్డి కోరినట్టుగా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. అయితే, 25వ తేదీ వరకు అవినాష్ ను అరెస్టు చేయవద్దని మాత్రమే సీబీఐను ఆదేశించింది. అదే సమయంలో.. అరెస్టు అయి ప్రస్తుతం జైల్లో ఉన్న అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, మిత్రుడు ఉదయకుమార్ రెడ్డి ని సీబీఐ ఆరురోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించడానికి కోర్టు అనుమతించింది. వారిద్దరితో పాటు అవినాష్ ను కూడా కలిపి విచారించాల్సి ఉన్నదనే సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. అందువలన.. వారిద్దరూ సీబీఐ కస్టడీలో ఉండే ఆరురోజుల పాటు, అవినాష్ ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా సీబీఐ విచారణకు హాజరవుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్టు అయి ఉంటే .. కొంచెం తేడా రావడానికి అవకాశం ఉంది. అరెస్టు అయిన తర్వాత.. ఆయన జైల్లో పెట్టి మళ్లీ విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చేది. అప్పుడు ఈ ఉమ్మడి విచారణ అనేది ఒకటిరెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ‘అవినాష్ అరెస్టు’ అనేది జరగలేదు తప్ప.. కోర్టు తీర్పు వలన.. వరుసగా ఆరు రోజుల పాటూ సీబీఐ కోరుకున్నట్టే విచారణ జరిగే పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా అనుమానితులను ఒకేసారి విచారణకు పిలిపించి.. వేర్వేరు గదుల్లో పెట్టి ఒకే ప్రశ్నలను వరుస క్రమంలో అడగడం, సమాధానాల్లో తేడాలు వస్తే.. తర్వాత ముగ్గురినీ ఒకేదగ్గర కూర్చోబెట్టి ఆ తేడాల గురించి నిలదీయడం.. తద్వారా నిజాలను రాబట్టడం వారి కసరత్తుగా జరుగుతుంది.
కోర్టు తీర్పు వలన విచారణ వారు అనుకున్నట్టే జరిగే అవకాశం ఉంది. ఉదయకుమార్ రెడ్డి, తండ్రి భాస్కర రెడ్డి సీబీఐ కస్టడీకి రాకముందే షెడ్యూలు ప్రకారం రెండు రోజుల కిందట అవినాష్ సీబీఐ విచారణకు వెళ్లి ఉంటే (హైకోర్టును ఆశ్రయించకుండా) పరిస్థితి ఏమయ్యేదో తెలియదు. కానీ.. ఇప్పుడు సీబీఐకు అనుకున్న తీరులోనే ఉదయ్ కుమార్ తోను, భాస్కర్ రెడ్డి తోను కలిసి ఏకకాలంలో సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఆయనకు ప్రతికూల సంకేతమే అని పలువురు భావిస్తున్నారు.
పాపం అవినాష్.. దీనికంటె అరెస్టు బెటర్ కదా!
Wednesday, January 22, 2025