యావత్ ఆంధ్రదేశంలో విజయవంతముగా ప్రదర్శించబడి, ఆ సినిమా నిర్మించిన విజయ ప్రొడక్షన్స్ అధినేతలైన నాగిరెడ్డి-చక్రపాణిలకు, కె. వి. రెడ్డిగారికి, సాంకేతికనిపుణలకు, నటీనటులకు ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చింది.
విజయావారు “షావుకారు” సినిమా నిర్మించిన అనంతారం ఏదైనా ఊహాజనిత సినిమా తీయాలనుకొన్నారు. దీనికి మధిర సుబ్బన్నదీక్షితుల వారి కాశీమజీలీ కథలను, అల్లాద్ధీన్ కథలను ప్రేరణగా తీసుకొని, మద్యప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణా నేపద్యంగా పాతాళభైరవి సినిమాకు రచన చేసారు పింగళి నాగేంద్రరావు గారు. పాతాళభైరవి సినిమాకు శాశ్వత కీర్తి రావడానికి కారణమైన కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు, మార్కస్ బార్ట్లేయ్ ఛాయాగ్రహణం, తోటరాముడిగా యన్.టి.రామారావు ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, పాతాళభైరవి చిత్రాన్ని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి.
మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును, హీరోగా, గోవిందరాజుల సుబ్బారావును కానీ, ముక్కామలను కానీ ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారు. కాని సంసారం సినిమా చిత్రీకరణలో రామారావును చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి తమ చిత్ర కథలోని నాయకపాత్రకు ఎన్టీయారే తగినవాడని ఆయనను ఎంచుకోవడం జరిగింది. 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవే.
తెలుగులో మార్చి 15, 1951 నాడు, తమిళంలో మే 17, 1951లో నాడు విడుదలై, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగు చలచిత్ర పరిశ్రమలో, 71 సంవత్సరాల క్రితమే, పాతాళ భైరవి ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాలలో 200 రోజులు ప్రదర్శించబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ చిత్రం విజయ ప్రొడక్షన్స్ వారికి ఉత్తమ చిత్రాలను నిర్మించే సంస్థగా పేరు, ప్రఖ్యాతలను సంపాదించింది.