జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 10వ తేదీ నుంచి విశాఖపట్నంలో తన మూడో విడత వారాహి పాదయాత్రను నిర్వహించబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో రెండు విడతలుగా నిర్వహించిన వారాహి యాత్రకు లభించిన అపూర్వమైన స్పందన నేపథ్యంలో విశాఖపట్నంలో ప్లాన్ చేసిన మూడో విడత యాత్ర అంతకుమించి సక్సెస్ కావాలని జనసేన పార్టీ ఆశిస్తున్నది. అయితే ఈ మూడో విడత యాత్రకు జనసేన ఎజెండా ఏమిటి? ప్రధానంగా ఏ అంశాల గురించి ప్రస్తావించబోతున్నారు? అనే విషయాలలో జనసేనాని ఇప్పటికే స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది!
వాలంటీర్ వ్యవస్థను పవన్ కళ్యాణ్ తొలినుంచి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు అయినా, కాస్త ముందు వెనుకలు ఆలోచించి లోపాల గురించి మాత్రమే వ్యాఖ్యలు చేశారే తప్ప ఆ వ్యవస్థను రద్దు చేయాలనే స్థాయిలో మాట్లాడలేదు! కానీ పవన్ అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థను ఉండనిచ్చేలా లేరు. మహిళల అక్రమ రవాణా కూడా వాలంటీర్లు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, ఆ వ్యాఖ్యలకు కొనసాగింపు అన్నట్లుగా కేంద్రంలో బిజెపి మంత్రి పార్లమెంటుకు గణాంకాలు సమర్పించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వ నాశనం చేస్తూ దానిని చంపేయడానికి సృష్టించినదే వాలంటీర్ వ్యవస్థ అని ఆరోపిస్తున్న పవన్ కళ్యాణ్, తాను కీలకంగా అధికారంలోకి వస్తే గనుక వారిని విడిచి పెడతారని అనుకోవడం భ్రమ. అలాగే తన వారాహి యాత్ర పూర్తి అయ్యేలోగా విశాఖపట్నంలో ఉన్న భూభాగోతాలు భూకబ్జాలు భూ అక్రమాలు అన్నీ కూడా ఒక కొలిక్కి రావాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. విశాఖ రాజధాని అని ప్రకటించిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో విపరీతంగా భూ దందాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు నగల కోసం హత్య చేసిన వృద్ధ మహిళ కుటుంబాన్ని కూడా తన పర్యటనలో కలుస్తానని పవన్ చెబుతున్నారు. ఇది కూడా జగన్ సర్కారుకు చెంపపెట్టులాగా మారుతుందనే అభిప్రాయం పలువురిలో ఉంది.