పవన్ వారాహి వాహనంపైకి బాలయ్య!

Sunday, December 22, 2024

2024 ఎన్నికలకు సంబంధించి సమరశంఖం పూరించడానికి పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని తయారుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా షెడ్యూలు ఖరారు కాలేదు గానీ.. కొత్త సంవత్సరంలో ఆయన మంచి ముహూర్తం చూసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా వారాహి యాత్ర ప్రారంభిస్తారు. జగన్ ప్రభుత్వం మీద నిప్పులు చెరగుతారు. వారాహి వాహనాన్నే యాత్రలో బసచేసే గదిగా, స్థానిక నాయకులతో చిన్న చిన్న సమావేశాలు నిర్వహించుకునే ఏర్పాట్లతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే వాహనాన్ని అవసరమైన చోట్ల బహిరంగసభల వేదికగా కూడా వాడుకునేందుకువీలుగా రూపొందించుకున్నారు. ఈవాహనం మీదనుంచే పవన్ కల్యాణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 

అయితే తాజా సమాచారం ఏంటంటే.. పవన్ యాత్రలో భాగంగా ఏదో ఒక సందర్భంలో బాలయ్య కూడా పాల్గొంటారని తెలుస్తోంది. వారాహి వాహనం మీద నుంచి పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన కూడా ప్రజలనుద్దేశించి మాట్లాడతారని, పవన్ ఎన్నికల యాత్రకు సంఘీభావంగా ఎన్నికల సమరానికి తొడకొడతారని సమాచారం. 

ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం లో బాలయ్యబాబు నిర్వహించే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా పవన్ కల్యాణ్ రాబోతున్న సంగతి అందరికీ  తెలిసిందే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ఈనెల 27న జరగాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఈ ఇద్దరు స్టార్స్ ఓ అరగంట పాటుభేటీ అయ్యారు. అన్నపూర్ణ స్టుడియోలో ఈ  ఇద్దరి చిత్రాలు షూటింగ్ జరుగుతుండడంతో.. అక్కడ గ్యాప్ లో ఇద్దరూ కలిశారు. పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు షూటింగులో ఉండగా, బాలయ్య వీరసింహారెడ్డి షూటింగులో ఉన్నారు. గ్యాప్ లో ఇద్దరూ తమ టీమ్ సభ్యులతో సహా భేటీ అయ్యారు. ముచ్చట్లు చెప్పుకున్నారు. అయితే ఈ ఇద్దరు నటులు ప్రత్యేకంగా కనీసం 20 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఆ భేటీలో సినిమా సంగతులకంటె రాజకీయాలే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఆ భేటీలోనే.. పవన్ తన యాత్రకు సంఘీభావంగా బాలయ్యబాబును ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ రూపొందించుకున్న వారాహి వాహనం గురించి బాలయ్య ప్రత్యేకంగా ఆరా తీసి వివరాలన్నీ తెలుసుకున్నారని సమాచారం. తన తండ్రి నందమూరి తారక రామారావు.. అప్పట్లో ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న చైతన్యరథాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత.. ఎన్నికల కోసం ప్రత్యేకంగా బస ఏర్పాట్లతో సహా వాహనం తయారుచేసుకోవడం ఇదేనని బాలయ్య కితాబిచ్చినట్టు తెలుస్తోంది. వీలును బట్టి.. ఏదో ఒక రోజున తాను కూడా పవన్ యాత్రలో భాగంగా వచ్చి, వారాహి వాహనం మీదనుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడతానని బాలయ్య చెప్పినట్టు సమాచారం. 

బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో వారాహియాత్ర సాగితే అక్కడినుంచి గానీ.. లేదా అనంతపురం జిల్లాలోనే ఏదో ఒక ప్రాంతంనుంచి గానీ.. వారాహి వేదికపై నుంచి ఈ ఇద్దరు నటులు రాజకీయ సింహనాదం చేసేఅవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles