జనసేనాని పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. విశాఖకు వచ్చిన ప్రధానితో, ఆయన బస చేసిన ఐఎన్ఎస్ చోళలో 40 నిమిషాల పాటు పవన్ కల్యాణ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. సమావేశం తర్వాత.. పవన్ కల్యాణ్ మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడారు. రాష్ట్రంలోని అనేక అంశాల గురించి ప్రధాని తనను అడిగి తెలుసుకున్నారని, తన అవగాహన మేరకు తెలిసిన విషయాలను ఆయనకు వెల్లడించానని పవన్ అన్నారు. చాలా క్లుప్తంగా, ఎలాంటి ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా పవన్ కల్యాణ్ మీడియా సమావేశం ముగిసింది. అయితే.. ఈ క్లుప్త ప్రసంగంలో ఒకే ఒక్క మాట.. తెలుగుదేశం పార్టీతో ఆయన కుదుర్చుకోబోయే ఎన్నికల పొత్తులకు సంబంధించిన సంకేతంగా పరిగణించాల్సి ఉంటుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మోడీతో తన భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తీసుకువస్తుందని చెప్పారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత మోడీని మళ్లీ కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని కార్యాలయం నుంచి రెండురోజుల కిందట ఫోను వచ్చిందని, కలవాల్సిందిగా చెప్పినందునే వచ్చి కలిసినట్లుగానూ వివరణ ఇచ్చారు. అయితే పొత్తులకు సంకేతం అన్నట్టుగా మరో మాట కూడా చెప్పారు.
‘తెలుగు ప్రజలు అందరూ ఐక్యతతో ముందుకు సాగాలనే మోడీ గారు కోరుకుంటున్నారు’ అంటూ పవన్ వెల్లడించారు. ఈ ఐక్యత దేనికి సంకేతం అనే చర్చ నడుస్తోంది. పవన్ కల్యాణ్ కు సంబంధించినంత వరకు జగన్ సర్కారు మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. జగన్ ప్రభుత్వాన్ని కూలదోస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు లేనేలేదని పవన్ కల్యాణ్ పదేపదే అంటున్నారు. అలాంటిది.. మోడీతో తన భేటీ.. రాష్ట్రానికి మంచి భవిష్యత్తున్న ప్రసాదిస్తుంది అని పవన్ అన్నారంటే.,. దాని అర్థం.. జగన్ సర్కారును కూలదోయడం గ్యారంటీ అని చెబుతున్నట్లుగానే తీసుకోవాలి.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ప్రజాగళం చీలిపోకుండా ఉండాలనేది పవన్ ఆకాంక్ష. వ్యతిరేక ఓటు చీలకుండా, ఐక్యంగా జగన్ ను మట్టి కరిపించాలని ఆయన పిలుపు ఇస్తుంటారు. అందుకే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోడానికి కూడా సిద్ధం అవుతున్నారు. కలసి ముందుకు సాగకపోతే మళ్లీ దుర్మార్గ ప్రభుత్వం వస్తుందనేది పవన్ మాటగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని ప్రధాని కోరుకుంటున్నారు అనే మాట.. తెలుగుదేశంతో పొత్తుల గురించి ఇస్తున్న సంకేతమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. ప్రధానితో భేటీ తర్వాత.. తెలుగుదేశంతో పొత్తుల గురించిన అధికారిక ప్రకటన ఆలస్యం కాకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.