రాహుల్ గాంధీకి శిక్ష పడిన తీరు, ఆయన ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తీరు చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సరికొత్త ఆలోచనలు వచ్చాయి. పవన్ కల్యాణ్ మీద ఒక వాలంటీరు క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఆ దావా విచారణకు వస్తే.. రాహుల్ తరహాలోనే పవన్ కు కూడా రెండేళ్లకు తగ్గకుండా జైలుశిక్ష పడుతుందని.. ఆ దెబ్బతో ఆయన మరో ఆరేళ్లపాటూ ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశమే లేకుండా పోతుందని వారు కలగన్నారు. అయితే రాహుల్ గాంధీ విషయంలో సుప్రీం కోర్టు తాజా తీర్పు బహుశా.. వైసీపీ దళాలకు షాక్ అయి ఉండొచ్చు.
రాష్ట్రంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రదర్శిస్తున్న దూకుడు, చేస్తున్న విమర్శలను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ప్రధానంగా ప్రజలను మభ్యపెట్టడం, యావత్తు పథకాల లబ్ధిదారులను ప్రభుత్వ అనుకూల ఓటర్లుగా మార్చడం అనే పనులకు వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకం అని వైసీపీ భావిస్తోంది. అందుకే కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలను మాత్రమే వాలంటీరు పోస్టుల్లోనియమించి, వారిని పోషిస్తోంది. అలాంటి నేపథ్యంలో.. వాలంటీర్లు వ్యవస్థ క్రెడిబిలిటీ ని ప్రశ్నార్థకం చేస్తూ పవన్ కల్యాణ్ అనేక సందేహాలు లేవనెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడుతున్న మహిళల/అమ్మాయిల అక్రమ రవాణాకు ఈ వాలంటీర్లు ఒక టూల్స్ లాగా ఉపయోగపడుతున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అక్కడితో పవన్ ఆగలేదు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. ఎన్నెన్ని అరాచకాలు జరుగుతున్నాయో, చట్టవిరుద్ధమైన సమాచార సేకరణ జరుగుతున్నదో కూడా హెచ్చరించారు. మొత్తానికి వాలంటీర్ల గురించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువచ్చారు. ఇప్పుడు వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి వివరాలు అడిగితే.. మా వివరాలు మీకెందుకు అని ప్రశ్నించే వాతావరణం తీసుకొచ్చారు.
దీనిని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ ప్రభుత్వం పవన్ మీద కేసు పెట్టాలని ఉత్తర్వులు కూడా జారీచేసింది. అదే సమయంలో రాహుల్ కు పడిన శిక్ష ఇచ్చిన స్ఫూర్తితో ఒక వాలంటీరుతో క్రిమినల్ పరువునష్టం దావా కూడా వేయించారు. మోడీ అనే పదం గురించి రాహుల్ వ్యాఖ్యలపై దావా వేసినట్టుగానే.. వాలంటీర్లు అనే వ్యవస్థ గురించి పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల.. తమ పరువు పోయిందంటూ ఓ మహిళా వాలంటీరు ఆయన మీద కేసు వేశారు. బహుశా ఆ కేసుద్వారా …. పవన్ కల్యాణ్ కు కూడా రెండేళ్ల జైలు శిక్ష పడుతుందని వారు కలగంటూ ఉంటారు. అయితే.. తాజాగా రాహుల్ మీద కేసును సుప్రీం కోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. బహుశా వైసీపీ వారి ఆశలు కూడా నీరుగారిపోయి ఉంటాయి. ఏదో రాద్ధాంతం చేద్దాం అనుకుని పవన్ మీద కేసు పెట్టారు గానీ.. అందులో కూడా తమకు ఎదురుదెబ్బ తప్పేలా లేదని వైసీపీ నాయకులే వాపోతున్నారు.