ప్రధాని నరేంద్ర మోడీతో ఉండే సాన్నిహిత్యం, భారతీయ జనతా పార్టీ పట్ల ఉండే గౌరవంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండవచ్చు గాక. అంతమాత్రాన ఆయన భారతీయ జనతా పార్టీ ఎలా చెబితే అలా నడుచుకునే నాయకుడిలాగా కనిపిస్తున్నారా? కమల బంధం అనేది ఆయన అందులోంచి వెలుపలికి రాలేని ఒకసారి గూడు లాగా మారిపోయి ఉన్నదా? అనే రకం అనుమానాలు, ప్రచారాలు కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి! అయితే తాజాగా తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ‘తెలుగుదేశంతో కలవకుండా పవన్ కళ్యాణ్ ను భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నదని’ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ అంశం మరో మారు చర్చకు వస్తోంది.
2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని ఎన్డీఏలో భాగస్వామిగా చేరారు. రెండు పార్టీలు కలిసి పరిమితంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించాయి. అయితే ‘2024 ఎన్నికలలో జగన్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను’ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఇంకొక ప్రచారం ప్రారంభమైంది! ఆయన మాటలను బట్టి జనసేనతో పాటు బిజెపి కూడా తెలుగుదేశం సారధ్యంలోని కూటమిలోకి చేరుతుందనే అభిప్రాయం ప్రజలకు కలిగింది. అదే జరిగితే 2014 నాటి ఫలితాలు పునరావృతం అవుతాయని అధికారపక్షం భయపడింది. అందుకే పవన్ గురించి ఒక వ్యూహాత్మక మైండ్ గేమ్ ప్రచారానికి తెర తీశారు! పవన్ కళ్యాణ్ కమలదళం కబంధహస్తాలలో చిక్కుకొని ఉన్నారని.. అందులో నుంచి బయటకు రావడం ఆయనకు అంత సులభం కాదని ప్రచారం చేయడం ప్రారంభించారు. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేలా పొత్తులతో కలిసి పోటీ చేసేలా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం అనేది బిజెపి అందుకు అంగీకరిస్తుందా లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది అని ఒక ప్రచారం నడిచింది. ఇప్పుడు పితాని సత్యనారాయణ మాటలు కూడా అలాగే ఉన్నాయి!
అయితే పవన్ కళ్యాణ్ అనే ఎవరినీ లెక్క చేయని నాయకుడు బిజెపి చెప్పినట్లు వింటాడా? అందుకోసం తన సొంత నమ్మకాన్ని, ఐడియాలజీని కూడా వదులుకుంటాడా అనేది ఇప్పుడు ప్రశ్న! పవన్ కళ్యాణ్ బిజెపి చెప్పు చేతల్లో ఉన్నాడని, జరుగుతున్న దంతా దుష్ప్రచారం మాత్రమేనని ఆయన అభిమానులు కొట్టి పారేస్తున్నారు. తెలుగుదేశంతో జతకట్టడానికి అనువైన వ్యూహాత్మక సమయం కోసం పవన్ వేచి ఉన్నారే తప్ప, కమలదళం అనుమతి కోసం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు తిరిగి ఎటు వస్తాయో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశంతో పొత్తు గురించిన అధికారిక ప్రకటన చేయడానికి పవన్ ఎంచుకున్న ముహూర్తం ఎంత దూరంలో ఉన్నదో వేచి చూడాలి.