సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ మీద లక్షల్లో ఫాలోయర్లు ఉంటే.. మహా గొప్ప సెలబ్రిటీలుగా పరిగణింపబడుతూ ఉండడం జరుగుతుంది. మిలియన్ ఫాలోయర్స్ అనేది చాలా పెద్ద సెలబ్రిటీలకు ఒక ప్రామాణికత. కానీ పవన్ కల్యాణ్ ట్విటర్ ఖాతాకు 5.3 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. దాన్ని బట్టి ఆయనకు యూత్ లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. అయితే దానిని మించి పవన్ కల్యాణ్ సిసలైన చరిష్మా అంటే ఏంటో అర్థం చేసుకోగల అవకాశం ఇవాళ వచ్చింది.
ట్విట్టర్ తో పాటు, పవన్ కల్యాణ్ మరో జనాదరణ ఉన్న సోషల్ మీడియా వేదిక ఇన్ స్టా లోకి అడుగుపెట్టారు. ఆయన కేవలం ఇన్ స్టా అకౌంట్ క్రియేట్ చేశారంతే.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ ఫాలోయర్స్ దాటేశారు. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ మామూల్ది కాదని దీన్ని బట్టి అర్థమవుతోంది.
ట్విటర్ ఖాతాలో పవన్ ఏ ఫోటోనైతే ప్రొఫైల్ పిక్ గా పెట్టారో.. అదే ఫోటోను ఇన్‌స్టాకు కూడా వాడారు. ట్విటర్ లో రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాత్రమే ఎక్కువగా షేర్ చేసుకుంటున్న పవన్ కల్యాణ్ ఇన్‌స్టా ఖాతాల్లో సినిమా సంగతులు కూడా పంచుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఈ ఖాతాకు ట్యాగ్ లైన్ గా యాడ్ చేసిన ‘‘ఎలుగెత్తు.. ఎదురించి.. ఎన్నుకో.. జైహింద్’’ అనే మాటలు మాత్రం ఆయన రాజకీయ భావజాలాన్ని ప్రతిబింబించేవిగానే ఉన్నాయి.
పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో చేసే పోస్టులకు కూడా విపరీతమైన జనాదరణ ఉంది. ఆయన ట్విట్టర్ లో ఒక్క మాట అంటే చాలు.. ఆ మాట మీద టీవీ ఛానెళ్లు చర్చోపచర్చలు నడిపించే సందర్భాలు అనేకం. ఆయన ఒక్క కార్టూన్ పోస్టు చేస్తే చాలు.. దానికి సంబంధించి.. ప్రభుత్వంలోని పెద్దలంతా భుజాలు తడుముకుని ఎదురుదాడి చేయడానికి తెగించడమూ చాలా సహజం. అలాంటిది.. పవన్ కల్యాణ్ ఇన్ స్టాలో కూడా అడుగుపెట్టడంతో.. ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా అరాచక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడడం కంటిన్యూ అవుతుందని.. పవన్ అభిమానులు ఆశిస్తున్నారు.