జనసేనాని పవన్ కల్యాణ్ తమ పార్టీ పదో ఆవిర్భావ సభను మచిలీపట్నంలో ఇవాళ భారీస్థాయిలో నిర్వహించబోతున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించేలా ఈ సభ ఉండాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నంలో తమ పార్టీ ఆవిర్భావ సభ చాలా కీలకం కాగలదని కూడా పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇదే సభలో.. భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకునే విషయాన్ని, తెలుగుదేశంతో బంధాన్నికూడా జనసేనాని ప్రకటిస్తారని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.
పవన్ కల్యాణ్ గత ఏడాది ఆవిర్భావసభలోనే.. తెలుగుదేశంతో పొత్తులకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు. ‘24 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని ప్రకటించి కొత్తపొత్తుల హింట్ ఇచ్చారు. అప్పటినుంచి రకరకాల చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు సభలో పొత్తులపై స్పష్టత వస్తుందని సమాచారం. అలాగే జనసేనకు భారంగా మారుతున్న భారతీయజనతా పార్టీతో స్నేహానికి కూడా ఇవాళ ఫుల్ స్టాప్ పెడతారని తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని లౌక్యంగా ఎలా ప్రకటించాలా? అనే విషయంలోనే పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నారు.విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి… కర్ర విరగకుండా పాము చావకుండా భాజపాను వదిలించుకునే మార్గం చూస్తున్నారు.
‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాం. అయితే జనసేనకు గౌరవప్రదంగా ఉండేలాగా మాత్రమే ఈ పొత్తు ఉంటుంది. జనసైనికుల ఆత్మగౌరవం దెబ్బతినేలా పొత్తు ఉండదని హామీ ఇస్తున్నాను. జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కలిసి రావాల్సిందిగా.. బిజెపిని కూడా ఆహ్వానిస్తున్నాను. వారు కూడా కలిసి వస్తే బలీయమైన శక్తి అవుతుంది. దుర్మార్గమైన ప్రభుత్వ పతనం సాధ్యమవుతుంది. అయితే వారు కలిసి రాకపోయినా సరే.. తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది. అలాగని నరేంద్రమోడీ మీద, అమిత్ షా మీద నాకు గౌరవం తగ్గదు’’ అనే తరహాలో ఆయన ప్రసంగ వాక్యాలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశంతో పొత్తు ప్రకటన అధికారికంగా వచ్చేస్తే.. బిజెపి శ్రేణులనుంచి ఆ పార్టీలోని జగన్ అనుకూల నాయకుల నుంచి కొంత విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉన్నది గానీ.. అలాంటి ఏ విమర్శల పట్ల కూడా స్పందించకుండా ఉండాలని పవన్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఆ మేరకు తమ పార్టీ శ్రేణులందరికీ ఇప్పటికే సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. సో, పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులు, తెగతెంపులు రెండూ తేలిపోనున్నాయి.
పవన్ కల్యాణ్ .. బీజేపీతో కటీఫ్ ప్రకటన ఈరోజేనా?
Friday, November 15, 2024