పవన్ కల్యాణ్ ఆశిస్తున్న నిజాయితీ గల రాజకీయాలకు ఇంకా ఆదరణ పూర్తి స్థాయిలో ఏర్పడకపోయి ఉండవచ్చు. కానీ.. తన వైఫల్యాలను కూడా నిజాయితీగా చెప్పుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆ ధైర్యాన్ని మనం పవన్ కల్యాణ్ లో మాత్రమే చూడగలం. తమ ఓటమిని, తమ వైఫల్యాలను నిజాయితీగా ఒప్పుకునే, చెప్పుకునే అలవాటు కేవలం పాతతరం రాజకీయ నాయకుల్లో మనకు బాగా కనిపించేది. తరం మారుతున్న కొద్దీ..రాజకీయ నాయకులు బుద్ధులు మారుతూ వచ్చాయి. ఆలోచనలు మారుతూ వచ్చాయి. తమ వైఫల్యాలకు ఇతరులను నిందించడం, కుట్రలు జరిగాయని ఆరోపణలు చేయడం చాలా మామూలు సంగతి అయిపోయింది. కానీ.. పవన్ కల్యాణ్ తాను అందరి లాంటి రాజకీయ నాయకుడు కాదని మరోమారు నిరూపించుకున్నాడు.
హైదరాబాదులో ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ వారు నిర్వహించిన కార్యక్రమంలో అంతర్జాతీయంగా విద్యార్థులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. ‘ప్రస్తుతానికి నేను విఫలరాజకీయ నేతనే’ అని ఆయన చెప్పుకున్నారు. ఈ తెగువ అందరికీ ఉండదు. అదే సమయంలో ‘కానీ ఎప్పటికీ ఓడిపోయిన వ్యక్తిని కాను’ అనే మాటతో తనలోని ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని, ఆశల్ని సాకారం చేసుకోవడం కష్టింతే తత్వాన్ని, ఆశావహ దృక్పథాన్ని ఆయన విద్యార్థులకు సందేశంగా అందించారు.
ఈ కార్యక్రమంలో పవన్ ప్రసంగం చాలా హుందాగా సాగింది. ఎలాంటి బుకాయింపు లేకుండా తన జీవితంలోని అన్ని ఓటములను పవన్ కల్యాణ్ ఒప్పుకున్నారు.తన మొదటి సినిమా కూడా పరాజయం పాలైందన్నారు. మధ్యలో సుమారు ఏడేళ్లపాటు హిట్ లు లేకుండానే తన సినిమా కెరీర్ సాగిందన్నారు.కానీ సహనంతో వేచి ఉండాలని ఆయన సందేశం ఇచ్చారు.
రాజకీయ నాయకుల్లో చాలా తక్కువమందిలో మాత్రమే కనిపించే నిజాయితీ పవన్ మాటల్లో కనిపించింది. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ ఒకే ఎమ్మెల్యే సీటులో గెలిచింది. ఆ ఎమ్మెల్యే కూడా తర్వాత పార్టీని వంచించి వైసీపీ గొడుగు కిందకు చేరారు. కానీ.. పవన్ డీలా పడలేదు. పైగా ప్రస్తుతం అంత దయనీయమైన స్థితిలో పార్టీ లేదు. ప్రజల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉండే వ్యక్తిగా పవన్ కల్యాణ్ తనను తాను ఈ మూడున్నరేళ్లలో చాలా నిరూపించుకున్నారు. పార్టీకి ఆదరణ పెరిగింది. వారి బలం కూడా పెరుగుతుంది. పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా ఆయన ఎప్పటికీ ఓడిపోయిన నాయకుడుగా ఉండిపోరు.