‘పొత్తులు అనేవి ఎన్నికల వేళ తేలుస్తాం’ అని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి కొండగట్టులో ప్రత్యేకపూజలు చేయించి, ధర్మపురి లక్ష్మీనారసింహుని దర్శనంతో తన అనుష్టుప్ నారసింహ యాత్రను ప్రారంభించిన పవన్ కల్యాణ్ పొత్తుల గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉన్నదని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ ఆలోచన సరికాదని ఆయన తెలుసుకోవాలి.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజెపి సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామిగా ఉన్నారు. తెలంగాణలో వారితో కూడా పొత్తులేదు అని ఆయన ప్రకటించారు గానీ.. ఏపీలో వారితో పొత్తు ఉన్నట్టే. కానీ ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ప్రతిజ్ఞను అనుసరించి.. తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఆ విషయం బహిరంగంగా ప్రకటించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా సమయం ఉందని అంటున్నారు.
నిజానికి ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో ఉన్నాయని అనుకుంటే భ్రమ. సమయం లేదని ఆయన తెలుసుకోవాలి. ఒకవైపు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకుని.. టీడీపీ, వైసీపీలతో సమానదూరం ఉంటుందని, పొత్తులు ఉండవని తెగేసి నిర్ణయం తీసుకుంది. పొత్తులు ఉండవనే విషయంలో భాగస్వామ్య పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు.. తాను కోరుకుంటున్న పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ ఇప్పటికీ నిర్ణయానికి రాకపోతే ఎలా? అందుకే ఆయన తక్షణం నిర్ణయించుకోవాలని పార్టీ కార్యకర్తలే కోరుకుంటున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు అనుచరులు 500 మంది కూడా పార్టీని వదిలిపెట్టారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రకటించిన భవిష్యత్ విధానాలు వారికి నచ్చకపోయే ఉండవచ్చు. అయితే ముందు నుంచి కన్నా పార్టీని వదిలిపెడతారని ప్రచారం ఉంది. అది ఇవాళ్టికి కుదిరింది. ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇటీవల నాదెండ్ల మనోహర్, కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి భేటీ అయిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
పవన్‌తో జత కలిసి భవిష్య ప్రస్థానం సాగించే విషయంలో కన్నా లక్ష్మీనారాయణ ఎంత త్వరగా నిర్ణయం తీసుకుని కార్యరంగంలోకి దిగితే అంత మంచిది జాప్యం. జరిగితే రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశం ఉంది. సీనియర్ నాయకుడిగా కన్నా లక్ష్మీనారాయణ చేరిక జనసేన పార్టీకి ఖచ్చితంగా అదనపు బలం అయ్యే అవకాశం ఉంది. కానీ పార్టీలో చేర్చుకోవడంలో ఆలస్యం చేస్తే బలాలు కూడా బలహీనతలయ్యే ప్రమాదమూ ఉంటుంది.