అదంత ఆషామాషీ వ్యవహారం ఎంతమాత్రమూ కాదు. కేంద్రంలోని ప్రభుత్వం పట్ల, బిజెపి పట్ల, ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోడీ పట్ల చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో మితవాద ధోరణులనే అవలంబిస్తుండవచ్చు గాక! కానీ.. పాతసంగతులు అన్నీ మర్చిపోయి.. ఆయనతో జట్టుకట్టడానికి భారతీయజనతా పార్టీ ఒప్పుకుంటుందా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట నిజమే. అంతమాత్రాన, ప్రత్యేకించి చంద్రబాబు యొక్క అవసరం వారికి లేకపోతుండగా.. ఆయనతో జట్టుకట్టడానికి ఒక మెట్టు దిగే పరిస్థితికి వారు తలొగ్గుతారా? ఇవి మిలియన్ డాలర్ ప్రశ్నలు. అందుకే ఈ ఫీట్ సాధిస్తే గనుక, అనగా, తెలుగుదేశం నేతృత్వంలో ఏపీలో ఏర్పడగల కూటమిలో జనసేనతో పాటు, బిజెపి కూడా ఉన్నట్టే. ఆ కూటమికి తిరుగులేని బలం చేకూరినట్టే.
2024 ఎన్నికల నాటికి జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వ బోనని పవన్ కల్యాణ్ చాలాకాలంగా చెబుతున్నారు. అదే మాట మీద ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తను ఏ వైపు ఉన్నట్లో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ సొంతంగానే బరిలోకి దిగి తమ బలం ఏమిటో నిరూపించుకుంది. అవి కేవలం పట్టభద్రుల మనోభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికలే కావొచ్చు గాక. కానీ ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి ఇంకొంత దన్ను లభిస్తే.. ఇంకో ముప్పయ్యేళ్లు పాలన సాగించాలనుకుంటున్న జగన్ స్వప్నాన్ని ఛిద్రం చేయగలదని అనుకోవడం గ్యారంటీ.
పవన్ కల్యాణ్ హస్తినాపురంలో ప్రస్తుతం అదే పనిమీద ఉన్నారా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. పవన్ కల్యాణ్ తన రాజకీయ ఆంతరంగికుడు నాదెండ్ల మనోహర్ ను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఏపీ వ్యవహారాల ఇన్చార్జిని కలిశారు. అలాగే జాతీయ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాను, హోంమంత్రి అమిత్ షాను, కుదిరితే ప్రధాని మోడీని కూడా కలిసే ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. ఈ పెద్దలందరినీ కలవడం వెనుక అసలు ఎజెండా.. పొత్తుల సంగతి తేల్చుకోవడమేనన్నది సుస్పష్టం. వీటి మధ్యలో గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసే అవకాశం వచ్చింది గనుక.. పోలవరం గురించి కూడా కొంత విన్నపాలు చేశారు. కానీ అసలు కార్యాన్ని ఆయన నెరవేర్చుకుని రాగలరా?
బిజెపికి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ‘అవసరం’ పెద్దగా లేదు. పైగా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి తన శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. మోడీ ఎదుట సాగిలపడుతూ వస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి నాయకులు కొందరు విమర్శలు చేస్తున్నా.. వారిని తిరిగి పల్లెత్తు మాట అనకుండా.. మిన్నకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిజెపిని చంద్రబాబుతో జతకలిసే కూటమికి ఒప్పించడం కత్తిమీద సామే. దానిని సాధిస్తే పవన్ కల్యాణ్ మొనగాడు కింద లెక్క!
పవన్.. ఆ ఫీట్ చేస్తే ఇక తిరుగులేదంతే!
Thursday, November 21, 2024