పవన్ అంటే.. ఎర్ర పార్టీలకు కన్ను కుడుతోంది!

Sunday, December 22, 2024

జనసేనాని పవన్ కల్యాణ్ కు జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిలో ప్రాధాన్యం లభిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ విలువ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నట్టుగా.. ఏపీలో జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండేలా ఆయన మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిర్చగలిగితే.. పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉంది. అందుకే ఆయన చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు కూడా..! అయితే ఈ పరిణామాలను వామపక్ష పార్టీలు జీర్ణం చేసుకోలేకపోతున్నాయని అనిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఎన్డీయే పక్షాల భేటీకి హాజరు కావడానికి వెళ్లిన పవన్ కల్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రమైన విమర్శలు చేయడమే అందుకు కారణం.!

చేగువేరాను ఆదర్శంగా చెప్పుకునే పవన్ కల్యాణ్, ఆయన విలువలను తుంగలో తొక్కేసి, మతవాద పార్టీ అయిన బిజెపితో చేతులు కలిపారని సీపీఐ నారాయణ ఆరోపిస్తున్నారు. పవన్ భాజపాతో చేతులు కలపడం అనేది ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదం అని ఆయన అంటున్నారు. తనను నమ్మిన యువతను పవన్ నిరాశకు గురిచేశారనేది నారాయణ ఆరోపణ. అధికారం కోసం గడ్డితింటారా? అంటూ పవన్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం విశేషం.

పవన్ తన వ్యూహం ఏదో తాను అనుసరిస్తూ ఉంటే సీపీఐ నారాయణకు అంత కోపం ఎందుకు? అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే.. పవన్ జనసేన పార్టీ సింగిల్ గా ఉంటే.. విప్లవాలు- సమసమాజం లాంటి మాటలు చెప్పి.. తాము ఆయనతో జట్టుకట్టవచ్చునని ఎర్రపార్టీలు అనుకున్నాయి. గతంలో పవన్ ను ఆశ్రయించాయి కూడా. ఈ ఎన్నికల సందర్భంగా కూడా.. పవన్ కు ఓకే అయితే.. ఆయనతో జట్టుకట్టడానికి వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని గతంలో పలుమార్లు ప్రకటనలు కూడా చేశారు. ఆయన బిజెపితో బంధాన్ని మరింత పదిలంచేసుకుంటూ.. ఎన్డీయే పక్షాల భేటీకి కూడా హాజరై మోడీ అనుకూలంగా మాట్లాడడం అనేది నారాయణకు మింగుడుపడినట్టుగా లేదు. అందుకే ఆయన తన ఆవేశాన్ని బయటకు కక్కుతున్నారు. పవన్ తో జట్టుకడితే.. ఆయన బలాన్ని కాస్త వాడుకుంటే.. కనీసం ఒకటిరెండు సీట్లయినా గెలుచుకుని అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చుననే ఆశ ఆ పార్టీలకు ఉండవచ్చు. అదికాస్తా భంగపడేసరికి ఇప్పుడు ఇలాంటి విమర్శలకు దిగుతున్నారు. తమకు సీట్లు గెలవగల బలం కించిత్తయినా లేకపోయినా సరే.. అధికార పీఠంలో స్థానం మాత్రం కావాలనే దురాశ వలననే నారాయణ వంటి వారినుంచి ఇలాంటి అర్థంలేని విమర్శలు వస్తున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles