పవన్‌ను పిలవకపోవడం వెనుక జగన్!

Monday, November 25, 2024

విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ కార్యక్రమం జరగబోతోంది. భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జనసేనకు కనీసం ఆహ్వానం కూడా లేదు. తమ భాగస్వామ్య పార్టీలకు భారతీయ జనతా పార్టీ ఏమాత్రం విలువ ఇస్తుందో.. ఇంతకంటె పెద్ద ఉదాహరణ కూడా అక్కర్లేదు. నిజానికి విశాఖ సభకు ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తారని అందరూ అంచనా వేశారు. ఆహ్వానం తప్పకుండా ఉంటుందని పవన్ కల్యాణ్ కూడా అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా జరుగుతోంది. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం పంపకుండా ఉండడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉన్నట్టుగా అమరావతి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ తన విమర్శల దాడితో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇటీవలి కాలంలో మరింతగా ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. జగన్ కోటరీ కూడా.. పవన్ ను అతిపెద్ద శత్రువుగా పరిగణిస్తోంది. ఆయన మీద వైసీపీ నాయకులు చాన్సు దొరికితే చాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటే గనుక.. తన ప్రసంగంలో జగన్ సర్కారు మీద విమర్శలతో విరుచుకుపడతారని, అదే వేదిక మీద ఉండే జగన్ కు అది ఇబ్బందికర పరిణామం అవుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే పవన్ కు ఆహ్వానం అందకుండా చక్రం తిప్పారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయినా కేంద్రప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం విషయంలో.. జగన్ వర్గం మాట వినవలసిన అవసరం ఏమిటి? అతిథులను నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా కేంద్రానికి లేదా స్థానిక బిజెపికి లేదా? అనే సందేహం పలువురికి కలుగుతోంది! దీనికి సమాధానం మాత్రం బిజెపి అసమర్థతే. సాక్షాత్తూ ప్రధాని మోడీ విశాఖలో కార్యక్రమానికి వస్తుండడం వారికి చాలా పెద్ద వేడుక. అయితే ప్రధాని కార్యక్రమానికి బలసమీకరణ చేయగల సత్తా వారికి లేదు. కేవలం బిజెపి శ్రేణులు మాత్రమే జనసమీకరణకు ప్రయత్నిస్తే గనుక.. అయిదారువేల మంది కూడా హాజరవుతారనే గ్యారంటీ లేదు. లక్ష మందికి పైగా జనసమీకరణతో ప్రధాని సభను ఘనంగా నిర్వహించాలని కోరిక మాత్రం ఉంది. అందుకే వారికి గతిలేక వైసీపీ మీద ఆధారపడుతున్నారు. ప్రధానితో రాసుకుపూసుకు తిరగడానికి ఉత్సాహపడుతుండే వైసీపీ కూడా ఎగిరిగంతేసి జనసమీకరణకు పూనుకుంది. అయితే పవన్ కల్యాణ్ ను ఆహ్వానించకూడదు అనే కండిషన్ పెట్టినట్టు సమాచారం. ప్రధాని సభ బాధ్యతలను చూస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందుకు తలొగ్గారు. భీమవరం కార్యక్రమం సందర్భంలో కూడా కిషన్ రెడ్డి వేరే మార్గం లేక.. జగన్ చెప్పినట్టుగా విన్నందువల్లనే పవన్ ను ఆహ్వానించలేదని సమాచారం. అలాగే ఈ సభకు కూడా పవన్ ను దూరం పెట్టి.. .జనసమీకరణకు ఆధారపడుతున్నారని తెలుస్తోంది. అయితే.. పవన్ ను గౌరవంగా ఆహ్వానిస్తే లక్షమందిని సమీకరించడం జనసైనికులకు పెద్దపనికాదు కదా.. అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles