కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో, ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని, తర్వాత విరమించుకున్న సంగతి తెలిసిందే. దీక్షకు ముందే ఆస్పత్రికి తరలించగా, అక్కడ కూడా దీక్షకే ఉపక్రమించిన జోగయ్యతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడి.. ఆ ఆలోచన విరమించుకోవడానికి ఒప్పించారు. ఈ ఎపిసోడ్ పుణ్యమాని.. కాపు ల 5 శాతం రిజర్వేషన్ అనే సమస్య ఒక కొలిక్కి రాకపోయినప్పటికీ.. విపరీతంగా చర్చనీయాంశం అయింది. అందులో సందేహం లేదు. ఈ డిమాండ్ విషయంలో తాను కూడా స్వయంగా భాగం పంచుకున్న, అవాంఛనీయంగా ఏమీ జరగకుండా చూసిన పవన్ కల్యాణ్ పట్ల కాపుల్లో ఒక ఆదరణ ఏర్పడింది కూడా.
అయితే.. తాజాగా ప్రభుత్వం తరఫున మంత్రి అంబటి రాంబాబు తెరమీదికి వచ్చారు. కాపుసోదరులకు ఆయన ఓ అద్భుతమైన వీడియో సందేశం ఇచ్చారు. ఆయన వీడియో సందేశం యొక్క ఎజెండా ఒక్కటే. కాపుల్లో పవన్ కల్యాణ్ పట్ల విషబీజాలు నాటడం. కాపులకు పవన్ మీద ఏమైనా ప్రేమ ఉన్నట్లయితే దాన్ని కలుషితం చేయడం మాత్రమే. నిజానికి తనకు ఎంతో ఆత్మీయుడు అయిన వృద్ధనేత హరిరామజోగయ్య దీక్షను పోలీసుల బలంతో అణిచివేయడానికి ప్రయత్నించడం తప్ప.. ప్రభుత్వం మరో రకంగా స్పందించలేదు. ఆయనేమో ఆస్పత్రిలో కూడా దీక్షకే సిద్దపడ్డారు.ఏ చిన్న అవాంఛనీయ పరిణామం జరిగి ఉన్నా.. ప్రభుత్వం మొత్తం అతలాకుతలం అయిఉండేది.
కాపులా ఆగ్రహం మిన్నంటి ఉండేది. రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలు అదుపుతప్పి ఉండేవి. సామాజిక సౌహార్ద వాతావరణం సర్వనాశనం అయిఉండేది. ఇదేం జరగకుండా.. పవన్ కల్యాణ్ తాను పూనుకుని హరిరామజోగయ్య దీక్ష విరమించేలా చేశారు. నిజానికి ఈ ప్రభుత్వం పవన్ కల్యాణ్ కు రుణపడి ఉండాలి. థాంక్స్ చెప్పాలి. కానీ అలాకాకుండా ఆయన మీదనే విషం చిమ్ముతున్నారు.
తెలుగుదేశం హయాంలో కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ దీక్ష చేసినప్పుడు పవన్ కల్యాణ్ మద్దతివ్వలేదని, జగన్ ప్రభుత్వంలో దీక్ష జరుగుతోంటే మద్దతిస్తున్నారని.. ఆయన ప్రేమ కాపుల మీద కాదని చంద్రబాబు మీదనేనని అంబటి రాంబాబు వక్రభాష్యాలు చెబుతున్నారు. అప్పట్లో కాపుల మీద కేసులు పెడితే మాట్లాడలేదని కాపులను పవన్ కల్యాణ్ మీదికి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అప్పట్లో కాపు ఆందోళనలు జరిగినప్పుడు అవాంఛనీయ ఘటనలకు, ఆ సమూహాల్లో కలిసిపోయిన వైసీపీ గూండాలే కారణం అని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆ వార్తలన్నీ ప్రజలు మర్చిపోయారని అంబటి అనుకుంటున్నారేమో గానీ.. పవన్ కు కాపులను దూరం చేయడానికి ఈ ఎత్తుగడ వేయడం విశేషం.
పవన్‌ను కాపులకు దూరం చేసే కుట్ర!
Wednesday, January 15, 2025