వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ యుద్ధ రంగంలోనే ఉన్నట్లుగా విమర్శలతో విరుచుకుపడుతున్న తీరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంగారు మొదలవుతోంది. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వంలో ప్రతి లోపాన్ని ఎండగడుతూ ప్రభుత్వ అసమర్ధతలను గట్టిగా నిలదీస్తూ దూసుకెళుతున్నారు. అదే సమయంలో ఆయనకు ఎలాంటి కౌంటర్లు ఇచ్చి తమ పరువు కాపాడుకోవాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ భార్యల విషయం తప్ప మరొక అంశం మాట్లాడలేరు. ఆయనకే చేతకాని ప్రతివిమర్శలు ఆయన అనుచరులకు మాత్రం ఎలా కుదురుతాయి? అనుచర నాయకులకు కూడా పవన్ మీద ఎలాంటి విమర్శలు చేయాలో ఆలోచన రావడం లేదు. పాచిపోయిన పదాలను పట్టుకుని సరికొత్తగా అవే సంధిస్తున్నారు.
తాజాగా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద కోపావేశాలను కురిపించారు. తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి పవన్ భయపడుతున్నాడని అబద్ధాలు ఆడడంలో చంద్రబాబును మించిపోతున్నారని తనకు తోచినదంతా చెప్పుకున్నారు. అదేక్రమంలో పవన్ కళ్యాణ్‌కు తాను ఒంటరిగా ఎన్నికల బరిలో దిగగలననే నమ్మకం లేదని, దమ్ముంటే జనసేన ఒంటరిగా పోటీ చేయాలని నందిగం సురేష్ సవాలు విసిరారు.
జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడం అనేది ముగిసిపోయిన అధ్యాయం. ఏడాదిన్నర కిందిటి వరకు జనసేన ను ఒంటరిగా పోటీ చేయమని సవాళ్లు విసిరితే అర్థం ఉండేది. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన అంతం చేయడానికి.. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడం కోసం మాత్రమే విపక్షాలన్నీ ఒక్కటి కావాలని పిలుపు ఇవ్వడం జరిగింది. కేవలం అందుకోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తులు సీట్ల పంపకాల గణాంకాలు రేపో ఎల్లుండో వెల్లడవుతాయని ఎదురుచూస్తున్న తరుణంలో.. నందిగం సురేష్ ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని పాచిపోయిన డిమాండ్ ని పనికిరాని సవాల్నే మళ్లీ పవన్ మీదికి సంధిస్తున్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను అంశాల వారీగా విచ్చలవిడిగా ఎండగడుతున్నారు. ఆ విమర్శలను తట్టుకోవడం వాటికి జవాబు ఇవ్వడం అధికార పార్టీ వారికి సాధ్యం కావడం లేదు. పవన్ చేస్తున్న విమర్శలకు జవాబు చెప్పలేక.. ఆయన భార్యల గురించి, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయమనే అంశం గురించి ఆ నాయకులు మాట్లాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ ప్రభుత్వాన్ని నడిబజార్లో ఉతికి ఆరేస్తుండగా, తమ పార్టీ పరువు కాపాడుకోవాలంటే ఇలాంటి పాచి విమర్శలు కాకుండా.. వైసీపీ నేతలు కొత్తదార్లు వెతుక్కోవాలి.