పరువు తీసేలా కాంగ్రెస్‌లో ముసలితనం చర్చ!

Thursday, December 18, 2025

కాంగ్రెస్ పార్టీలో అందరూ ముసలి నాయకులే తయారయ్యారు. పార్టీని వాళ్లు వీడిపోవడం లేదు. పార్టీని వారు ముందుకు కూడా పోనివ్వడం లేదు.. అనేది చాలా కాలగా ఆ పార్టీ వర్గాల్లోనే ఉండే అభిప్రాయం. కేవలం వృద్ధనాయకుల చాణక్య తెలివితేటలు, వారు పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తుండడం వంటి వైఖరి కారణంగానే.. పార్టీ పగ్గాలు స్వీకరించడానికి రాహుల్ గతంలోనే విముఖంగా తయారయ్యారనే సంగతి అందరికీ తెలుసు. పార్టీని యువరక్తంతో నింపి, ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ సంకల్పిస్తున్న తరుణంలో.. సీనియర్ ముసుగులో వృద్ధ నాయకులందరూ అడ్డుపడ్డారు. సోనియా భజన చేస్తూ రాహుల్ ప్రయత్నాలను పడనివ్వలేదు. దీంతో విసిగిపోయి.. అసలు పార్టీ ఎడ్మినిస్ట్రేషన్ జోలికి వెళ్లకుండా రాహుల్ దూరం ఉండిపోయారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి ముసలి నాయకులు సమస్య కాదు. పార్టీనే ముసలిది అయిపోయింది. అలాంటి పార్టీలో తాజాగా ప్లీనరీ సందర్భంగా కూడా ముసలితనం గురించిన చర్చ రావడమే తమాషా.
అధినేత్రి సోనియా తాను ఇక రాజకీయాల నుంచి రిటైర్ కావాలని అనుకున్నారు. ఆ విషయాన్ని ఈ ప్లీనరీ వేదికగా ప్రకటించాలని అనుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతోంది. అందుకోసమే.. పార్టీకి పాతికేళ్లుగా సోనియా అందించిన సేవల గురించి ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీ రూపొందించి.. ఈ సమావేశాల్లో దానిని ప్రదర్శించారు.
ఆ వీడియో ప్రదర్శన తర్వాత సోనియా మాట్లాడుతూ ఈ వీడియో చూస్తోంటే నేను ఎంత ముసలిదాన్ని అయిపోయానో నాకే అర్థమవుతోంది..అని వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రస్థానం భారత్ జోడోయాత్ర వంటి మంచి కార్యక్రమంతో ముగుస్తున్నందుకు ఆనందంగా ఉందని కూడా అన్నారు. పరోక్షంగా రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో యువనాయకత్వం తయారు కావాలని ఆమె అభిలషించారు. ఇదే పెద్ద కామెడీగా ఉంది.
ఎంందుకంటే- సోనియా వయస్సు ఇప్పుడు 76 ఏళ్లు. 1946లో పుట్టిన ఆమె 1998లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ ఒకవైపు 75 ఏళ్లు దాటిన నేతలను పూర్తిగా క్రియాశీల రాజకీయాలనుంచి పక్కకు తప్పిస్తూ కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. అలాంటి నేపథ్యంలో 76 ఏళ్ల సోనియా, వీడియో చూసి తాను ఎంత ముసలిదాన్ని అయిపోయానో అర్థమవుతోందని అనడం వింత కాదు. కానీ, అదే సమయంలో.. 1942లో పుట్టిన 80 ఏళ్ల మల్లి ఖార్జున ఖర్గే నేతృత్వంలో యువరక్తం ఉరకలేయాలని, యువనాయకత్వం తయారు కావాలని అనడమే కామెడీగా ఉంది. ఇలాంటి మాటలు విన్నప్పుడే.. కాంగ్రెస్ పార్టీ గానీ, అందులోని నాయకులు గానీ ముసలి అయిపోలేదు.. ఆ పార్టీ ఆలోచనలే ముసలివి అయిపోయాయని అనిపిస్తుంది.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles