ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేస్తామని.. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని.. విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి రూపురేఖలు మార్చేస్తానని పదేపదే చెబుతూ ఉంటారు. అయితే ఆయన మాటలను ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు ద్వారా విశాఖకు ప్రామిస్ చేస్తున్న అభివృద్ధిని అక్కడి ప్రజలు నమ్ముతున్నారనే విశ్వాసం జగన్ కు లేనట్టుగా ఉంది. అందుకే రకరకాల కాంబినేషన్లు చూసుకుని ప్రస్తుతానికి విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ను విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకుంటున్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశానికి చాలా గట్టి పట్టున్న నియోజకవర్గాలలో ఒకటి. ఆ మాటకొస్తే విశాఖ సిటీలో ఉండే నాలుగు నియోజకవర్గాల్లో ఏ ఒక్క దానిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత రాజకీయాలలో తమ పార్టీ వైపు టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేని లాక్కోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు వైసిపి మొహం చూడలేదు. వారికి రాయబేరాలు ఫలించలేదు. తప్పనిసరిగా వారిని ఎన్నికల్లో ఓడిస్తే మాత్రమే అక్కడ వైసీపీ జెండా ఎగురుతుందని చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి నియోజకవర్గాలలో వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ తూర్పు నియోజకవర్గం కూడా ఒకటి.
ఆ మాటకొస్తే 2019 ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా జగన్ హవా కనిపించినప్పటికీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం లో మాత్రం వెలగపూడి ఏకంగా 28 వేల పేజీలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన మీద పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి కావాలనే ఉద్దేశంతోనే ఎంపీని, ఎమ్మెల్యే బరిలోకి దించుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, సదరు ఎంపీ ఇటీవలే వైసిపి ప్రభుత్వం పరువు తీశారు. తన భార్య కిడ్నాప్ కు గురైనప్పుడు విశాఖలో శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదని, రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని అనిపిస్తోందని, రాజకీయాలు మానేసి హైదరాబాద్ వెళ్లి వ్యాపారం చేసుకుంటానని విశాఖ ఎంపీ ప్రకటించారు. ఆ మాటలు పట్టుకుని రాజకీయ ప్రత్యర్ధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు. సొంత పార్టీ ఎంపీ కి కూడా ఆ రాష్ట్రంలో రక్షణ లేదని పారిపోవాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అలా అన్ని రకాలుగా పరువు తీసిన ఈ ఎంవీవీ సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించి విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గాన్ని కట్టబెట్టడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. వెలగపూడి ని ఓడించడానికి గట్టి అభ్యర్థి కావాలని కోరుకోవడం వరకూ ఓకే. కానీ అందుకోసం పార్టీ పరువు తీసిన ఎం వివి సత్యనారాయణ తప్ప జగన్మోహన్ రెడ్డికి మరొక గతి లేకుండా పోయిందా అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది!