బాధ్యత గల నీటిపారుదల శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారంటే ప్రజలు ఏం ఆశిస్తారు..? ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందో, దాని ద్వారా ఎప్పటికీ నీళ్ల నిలవ సాధ్యమవుతుందో తద్వారా కొత్తగా, కొన్ని వేల ఎకరాలు సాగులోకి వస్తాయో తదితర వివరాలను ఆశిస్తారు. మంత్రి గారి మాట కోసం ఎదురు చూస్తారు. కానీ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు, తన నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేదానితో నిమిత్తం లేదు. ఆయన పోలవరం పర్యటనకు వెళుతున్నారంటే, అందుకు ఒక పర్సనల్ ఏజెండా ముందే సిద్ధమై ఉంటుంది. ఆ ఏజెండా ప్రకారం వెళ్లి.. సాధ్యమైనంత మేర అక్కడ జరుగుతున్న జాప్యాన్ని పాత ప్రభుత్వం మీదికి నెట్టేసి.. ఇంకా ఏవేవో అవాకులు చవాకులు మాట్లాడేసి ఎంచక్కా తిరిగి వచ్చేస్తారు. శుక్రవారం నాడు అంబటి రాంబాబు చేసింది కూడా అదే.
కొందరు ఎంపీలను, ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని అంబటి రాంబాబు పోలవరం సందర్శనకు వెళ్లారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తయింది గనుక చూడడానికి నీటిపారుదల మంత్రి హోదాలో వెళ్లారు. జనం ఆశించే మాట ఆయన ఒక్కటి కూడా చెప్పలేదు. ఆయన పోలవరం యాత్ర యావత్తూ చంద్రబాబును నిందించడంతోనే సరిపోయింది.
టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారన్నది అంబటి ఆరోపణ. కానీ.. చంద్రబాబు ఏలుబడిలో పోలవరం ప్రాజెక్టు కోసం ఎలాంటి ప్రయత్నం జరిగిందో.. ఎంత చిత్తశుద్ధితో సమీక్ష సమావేశాలు జరిగేవో.. ప్రజలు లైవ్ లో కూడా వీక్షించారు. చంద్రబాబు సీఎంగా ప్రతి సోమవారం పోలవరం సమీక్షలు నిర్వహిస్తూ.. పనులను పరుగుపెట్టించాడనేది అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు పాపాల వల్లనే పోలవరానికి ఈ దుస్థితి అని రాంబాబు ప్రకటన చేసేశారు.
పోలవరం డ్యామ్ కు ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్ తెలుగుదేశం హయాంలోనే పూర్తయిన సంగతి తెలిసిందే. కాఫర్ డ్యామ్ ను ఇప్పుడు వైసీపీ పూర్తిచేసింది. అంతవరకు తాము ఘనకార్యం చేశామని వారు చెప్పుకుంటే ఒక తీరుగా ఉండేది. కానీ.. చంద్రబాబుహయాంలో ఎన్నడో పూర్తయిన డయాఫ్రం వాల్ నిర్మాణమే తప్పు అన్నట్లుగా రాంబాబు సెలవివ్వడం చిత్రమైన సంగతి. కాఫర్ డ్యాం పూర్తయిన తర్వాత మాత్రమే డయాఫ్రం వాల్ కట్టాలని అంబటిలోని ఇంజనీరింగ్ పరిజ్ఞానం సెలవిస్తోంది.
మేం చాలా చిత్తశుద్ధితో పోలవరం కడుతున్నాం అని చెబుతున్నారే తప్ప.. ఎప్పటికి పూర్తిచేస్తాం అనే మాట సంకేతంగా కూడా చెప్పడం లేదు. ఎంత చెడ్డా అంబటి రాంబాబు చాలా తెలివైన నాయకుడు. గతంలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్.. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండేళ్లలోనే ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లు అందిస్తాం అని పదేపదే ప్రకటించి అభాసుపాలయ్యారు. కానీ అంబటి రాంబాబు అలాంటి పొరబాటు చేయడం లేదు. చాలా జాగ్రత్తగా అసలు ప్రాజెక్టు పూర్తి గురించి మాటే ఎత్తడం లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని, పాలన, నిర్మాణ సామర్థ్యాన్ని నిందించడానికి మాత్రమే అంబటి పోలవరం యాత్ర పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.