పచ్చ సైంధవులందరూ స్వార్ధపరులే!

Monday, December 23, 2024

 ఎన్నికలు ఇంకొక ఏడాది కాలంలో ముంచుకు వస్తుండగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నాయకులు ఎడాపెడా తమ  ప్రత్యర్ధుల మీద విమర్శల బాణాలు కురిపిస్తున్నారు.  అలాగే ఇప్పటిదాకా ఒక పార్టీలో కొనసాగుతున్న వారు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం, భవిష్యత్తు రాజకీయ పరిణామాల పట్ల ఒక అంచనా తో ఇతర పార్టీలలోకి ఫిరాయించడం కూడా చాలా సహజంగా జరుగుతోంది.   గత ఎన్నికలలో 23 అసెంబ్లీ సీట్లను మాత్రమే దక్కించుకుని,  దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ..  ఇప్పుడు అధికారాన్ని దక్కించుకునే దిశగా బలోపేతం కావడానికి కష్టపడుతోంది.  సామాజిక వాతావరణం రాష్ట్రంలో అధికార మార్పిడికి అనుకూలంగా ఉన్నదని సంకేతాలు..  తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి.   ఈ నేపథ్యంలో  తటస్తులు మాత్రమే కాకుండా అనేకమంది ఇతర పార్టీలోని నాయకులూ కూడా తెలుగుదేశం లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

సరిగ్గా ఈ అంశం దగ్గరే అసలు వివాదం మొదలవుతోంది.  ఎందుకంటే ఎన్నికలు ఏడాదిలో ఉండగా,  ఇప్పుడు పార్టీలు చేరుతున్న వారు కచ్చితంగా టికెట్ మీద ఆశతోనే వస్తారనేది గ్యారెంటీ.  చంద్రబాబు నాయుడు కూడా బలమైన నాయకులు పార్టీలోకి వస్తే వారికి అవకాశాలు కల్పించడం పట్ల ఉదారంగానే ఉంటారు.  అయితే స్థానిక సమీకరణాల దృష్ట్యా కొందరు నాయకులు మాత్రం కొత్త చేరికలను,  ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను  వ్యతిరేకిస్తున్నారు. . కొత్త చేరికల వలన పార్టీ బలోపేతం అయ్యే మాట నిజమే కానీ,  స్థానిక నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేదే ఆలోచించాల్సిన  సంగతి. 

కొన్ని ఉదాహరణలను గమనిస్తే..  గుంటూరు జిల్లాలో ఎంతో బలమైన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.  అయితే ఆయన చేరికను మరో సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యతిరేకిస్తున్నారు. . వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది.  దీనిని దృష్టిలో పెట్టుకుని పార్టీలోకి కన్నాను తీసుకున్నట్లయితే,  ఏం చేయాలో తనకు తెలుసు అంటూ,  కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ వృద్ధ  నాయకుడు రాయపాటి సాంబశివరావు,  అర్థం లేని బెదిరింపులకు దిగుతున్నారు. 

 మరోవైపు నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది.  అక్కడ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేసి,  వారి మీద విమర్శలతో విరుచుకుపడుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశంలో  చేరవలసి ఉంది.  అయితే ఆయనకు తమ నుంచి ఆహ్వానం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు.  ఇలా వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ వారి స్వార్ధ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది.  ఎందుకంటే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి మంత్రి స్థానానికి ఆశావహుడుగా ఉంటారు.  ఆ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికే చెందిన మరొక కీలక నాయకుడు తమ పార్టీ నుంచే విజయం సాధిస్తే,  మంత్రి పదవులు పొందడంలో పోటీ ఏర్పడుతుందని ఆయన భయం కావచ్చు.  అదే తరహాలో ఆనం రామనారాయణ రెడ్డి రాక కూడా బహుశా సోమిరెడ్డికి ఇష్టం ఉండకపోవచ్చు.  కానీ స్థానిక నాయకులు ఇలాంటి స్వార్థ ఆలోచన వలన పార్టీ విస్తృత ప్రయోజనాలకు భంగం కలిగే లాగా వ్యవహరించకూడదని పలువురు కోరుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles