‘పచ్చగా’ ఏదైనా కనిపిస్తే చాలు సర్కారు ఉలికిపాటుకు గురవుతోందా? అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో కలుగుతోంది. ఒక భూవివాదం కోర్టులో ఇంకా వాదనల దశలో ఉండగానే.. ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకుని.. రచ్చబండ దగ్గర పెదరాయుడు పంచాయతీ తరహాలో తీర్పులు అమలు చేస్తుండడం విశేషం. అయితే ఇలాంటి పెదరాయుడు పంచాయతీలన్నీ తెలుగుదేశాన్ని అడ్డుకోవడానికి మాత్రమే.. పచ్చదనాన్ని చెరిపేయడానికి మాత్రమే అన్నది గమనార్హం. తాజాగా గొల్లపూడి వన్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన తీరు.. సర్కారు తీరును ప్రశ్నార్థకం చేస్తోంది.
విజయవాడ సమీపం గొల్లపూడి వన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. ఈ స్థలం లీజుకు సంబంధించి వివాదం ఒకటి స్థలయజమానులకు తెలుగుదేశం పార్టీకి మధ్య కోర్టులో నడుస్తోంది. ప్రస్తుతం ఆ భవనం, ఆవరణలో తెలుగుదేశం పార్టీ కార్యాలయమే నడుస్తోంది. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడానికి పార్టీ ప్లాన్ చేసినప్పటినుంచి ప్రభుత్వం రంగంలోకి దిగింది.
పార్టీ కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. దీనికి సంబంధించి అక్కడ సన్నాహాలు చేస్తోంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు వచ్చి ముందురోజే అడ్డుకున్నారు.వర్ధంతి రోజున తెదేపా నాయకులు దేవినేని ఉమా తదితరులు నడిరోడ్డు మీదనే పడుకుని రక్తదానం చేసి అధికారుల తీరుపట్ల నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
అయితే ఒక్కరోజు గడవకుండానే రెవెన్యూ అధికారులు ఇంకా దూకుడుగా విరుచుకుపడ్డారు. స్థలం వివాదంలో ఉన్నదంటూ ఆ భవనం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ఖాళీచేయించారు. వారి ఫర్నిచర్ మొత్తం బయటపెట్టి పంచాయతీ సిబ్బందికి అప్పగించేశారు. పార్టీ ఆఫీసును ఖాళీ చేయించడం వరకు ఒక ఎత్తు అయితే.. రెవెన్యూ అధికారులే.. పోలీసులను దగ్గర పెట్టుకుని మరీ భవనం మొత్తానికి ఉన్న పసుపు రంగులను చెరిపేయించి..వేరే రంగులు వేయించి, పార్టీ ఆఫీసు బోర్డును తొలగించి వేరే బోర్డు పెట్టించి మరీ వెళ్లడం విశేషం.
తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లు, ఆస్తుల విషయంలో సర్కారు తొలినుంచి కూల్చివేతలతో ఏ రకంగా విరుచుకుపడుతూ వచ్చిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. చివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కూడా పడ్డారని ప్రజలు అనుకుంటున్నారు.పచ్చదనం కనిపిస్తే చాలు.. దాన్ని చెరిపేయడానికి చూస్తున్నారని అంటున్నారు. వివాదం కోర్టులో ఉన్నప్పుడు కూడా.. ఇలా పెదరాయుడు పంచాయతీలు ఏంటని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
పచ్చదనం చెరిపేయడానికి పెదరాయుడు పంచాయతీలు!
Wednesday, January 22, 2025