పంపకాలు క్లియర్.. ఢిల్లీ రాజకీయాలకే హరీష్!

Wednesday, January 22, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. భారాస పేరుతో జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాలని అనుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే సంగతి కూడా స్పష్టం అయిపోయింది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత, భారాస నెగ్గితే, కేసీఆర్ వారసుల పాలనే తెలంగాణలో షురూ అవుతుంది. స్థానికంగా రాష్ట్రంలో పార్టీ మీద ఎవరి ఆధిపత్యం చెల్లుబాటులోకి వస్తుంది? అనే శషబిషలు లేకుండా కేసీఆర్ క్లారిటీ ఇచ్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అల్లుడు హరీష్ రావును కూడా ఢిల్లీ రాజకీయాలకే పరిమితం చేయడానికి కేసీఆర్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మొన్న మొన్నటి వరకు కేసీఆర్ వారసుడిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోయేది కేటీఆర్ నా? హరీష్ రావా? అనే మీమాంస పార్టీలో ఉండేది. రెండేళ్లుగా ఈ విషయంలో అనుమానాలు లేకుండా కొడుకు చేతికి పార్టీ పగ్గాలు ఇచ్చేశారు కేసీఆర్. అల్లుడి ప్రాధాన్యాన్ని తగ్గించారు కూడా. పార్టీ గెలిచే అవకాశం లేని కొన్ని ఎన్నికల సారథ్య బాధ్యతలను హరీష్ చేతిలో పెట్టారు. హరీష్ రావు ఒకప్పట్లో పార్టీ మీద అనన్యమైన పట్టు కలిగిఉన్నప్పటికీ.. నెమ్మదిగా తన పాత్రను మంత్రిత్వ శాఖ వరకు పరిమితం చేసుకున్నారు.
తాజాగా భారాస ఆవిర్భావ సభ నిర్వహణ ఏర్పాట్లు మొత్తం హరీష్ చేతుల మీదుగా జరుగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో భారాస ఎలాంటి ప్రభావం చూపించబోతున్నదో హరీష్ రావే మాట్లాడుతున్నారు. ఆ పరంగా ఖమ్మం జిల్లాలో పార్టీకి షాక్ లు రాకుండా సమన్వయ బాధ్యతలను కూడా ప్రస్తుతం హరీష్ రావే చూస్తున్నారు. కొంతకాలంగా పార్టీ తీరు మీద అసంతృప్తితో ఉన్న, పార్టీ మారుతారనే ప్రచారంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి హరీష్ వెళ్లి లంచ్ చేయడం, ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫునే పోటీచేస్తారని ప్రకటించడం.. భారాస ఆవిర్భావ సభకు కేసీఆర్ తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇవన్నీ గమనించదగ్గ అంశాలు.
ఖమ్మం భారాస సభ గురించి కేటీఆర్ స్పందించడం లేదు. ఆయన రాష్ట్రరాజకీయాలు చూసుకుంటారు అనే సంకేతాలు స్పష్టంగా వెళుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హరీష్ పోటీచేస్తారు గానీ.. ఎంపీ ఎన్నికలు రాగానే మళ్లీ ఆ బరిలో దిగుతారని, ఢిల్లీ రాజకీయాల్లో కేసీఆర్ కు అండదండగా కొనసాగుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles