నోరెత్తితే కత్తిదూస్తాం : అందరికీ ఇదే హెచ్చరిక!

Sunday, January 19, 2025

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమకు వ్యతిరేకంగా ఒక్క మాట వినడానికి కూడా ఇష్టపడని వైఖరితో ఉంటే..అది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సాధారణంగా ప్రతిపక్షాలు.. నిత్యం అధికారపార్టీ మీద విమర్శలు చేస్తూనే ఉంటాయి. వారి విమర్శల్లో కూడా స్వార్థం ఉంటుంది గనుక.. వాటిని పట్టించుకోకపోయినా ఒక రకం. కానీ.. ప్రజల నుంచి విమర్శలు వచ్చినా.. వారికి రాజకీయ రంగు పులిమి.. అరెస్టులుచేసి వేధించడం రివాజుగా మారింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా , ప్రభుత్వం తీరును ప్రశ్నించేలా అధికారులు ఒక్క నిర్ణయం తీసుకున్నా కూడా.. వారిని వేధించడమూ పెచ్చరిల్లుతోంది. తాజాగా బాపట్ల ఆర్టీసీ డీఎం మీద వేటు వేయడం రాష్ట్రంలో బహుధా చర్చనీయాంశం అవుతోంది.
అధికారులు అంటే.. కుక్కిన పేనుల్లా తమ చెప్పుకింద పడిఉండాలని, నోరెత్తి మాట్లాడకూడదని, రాష్ట్రహితం కోసమే అయినా స్వయం నిర్ణయాలు తీసుకోకూడదని రాజకీయ అధికారంలో ఉన్నవారు కోరుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది. బాపట్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
బాపట్ల జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మించుకోవడానికి రెండు ఎకరాల ఆర్టీసీ స్థలానికి ఏడాదికి వెయ్యిరూపాయలు అద్దె చెల్లించేలా 33 ఏళ్ల లీజుకు పొందడం అనే బాగోతాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా నడిపించారు. ఆర్టీసీ అధికారులకు ఏమాత్రం పోపిడి అందకుండానే.. ఆ స్థలం తమకు దక్కించుకున్నట్టుగా తహశీల్దారు ద్వారా పత్రాలు తయారుచేయించుకున్నారు. అదే ధైర్యంతో అక్కడ తమ పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు కూడా పూనుకున్నారు.
అయితే ఈ బాగోతం ఏమీ తెలియని అక్కడి ఆర్టీసీ డీఎం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన సమయంలో అక్కడకు వెళ్లి నాయకులతో ఇది తమ స్థలం అని, నిర్మాణం తగదని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తహశీల్దారుకు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. నిజానికి శ్రీనివాసరెడ్డి ఆ పని చేయకుండా ఉంటే అది ఇంకో పెద్ద తప్పుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిగణించి ఉన్నా ఆశ్చర్యం లేదు. ఆయన ఫార్మాలిటీ కోసం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు కూడా.
అయితే ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కింది. అధికారంలో ఉన్న పార్టీ, తమ కార్యకలాపాలకోసం రెండెకరాల జాగా కొనుక్కోలేని స్థితిలో ఉందా? ప్రభుత్వ భూముల్ని నాయకులే కాదు, పార్టీ పేరుతో కూడా కబ్జా చేయడం తమ హక్కుగా భావిస్తున్నారా? అంటూ ప్రజలు రకరకాలుగా దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలో డీఎం శ్రీనివాసరెడ్డి పై ఆర్టీసీ వేటు వేసింది. ఆయనను పదవినుంచి తప్పింది.
ఈ చర్య ద్వారా.. ప్రభుత్వం, వైసీపీ నాయకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఏ అధికారి వ్యవహరించినా సరే.. వారి మీద వేటు వేయడానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరికలు చేసినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రజల ఆస్తులను కాపాడడానికి ప్రభుత్వాధికారులు బాధ్యతగా వ్యవహరించినా కూడా వారి మీద వేటు వేస్తూ.. ఇలాంటి బెదిరింపు దందాలకు పాల్పడడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగదని ప్రజలు అనుకుంటున్నారు.

బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని కొట్టేసే వ్యవహారంపై ఈ వార్త కూడా చదవండి

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles