భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి వైఖరి గమనిస్తే.. వారు ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీని విజయపథంలో నడిపించడానికి అనే ఉద్దేశంతో కిషన్ రెడ్డికి పార్టీ సారథ్యం కట్టబెట్టారు సరే. మిగిలిన పదవులను ఎవరికి పంచుతున్నారు. తాము పార్టీ నుంచి వెళ్లిపోతాం అని సంకేతాలు ఇచ్చిన వారందరికీ పదవులను పంచేయడం అంటే.. దానిని ఎలా అర్థం చేసుకోవాలి.. వారు భయపడుతున్నారనుకోవాలా? పార్టీ నుంచి ఒక్కరు జారిపోయినా సరే.. తమపార్టీకి అతీగతీ లేకుండా పోతుందని అనుకుంటున్నారు. అందుకే నోరున్న నాయకులకు కిక్కురు మనకుండా పదవులు కట్టబెట్టి సంతృప్తి పరుస్తున్నారా? అనే అభిప్రాయం ప్రస్తుత పరిణామాలను గమనించిన వారికి కలుగుతోంది.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించారు. ఎటూ ఏపీలో సోమును కూడా తప్పించారు. మొత్తంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా చీఫ్ లను మార్చారు గనుక అర్థంచేసుకోవచ్చు. కిషన్ రెడ్డికి సారథ్యం అప్పగించడం వెనుక గల కులకోణాలను కూడా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంతో దూసుకుపోతున్న తరుణంలో.. తెలంగాణలో రెడ్డి వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుండగా.. వారిని తమవైపు మరల్చుకోవడానికి బిజెపి ఎత్తుగడ వేసిందని అనుకోవచ్చు. సాధారణంగా మత రాజకీయాలు మాత్రమే అలవాటైన బిజెపి.. తెలంగాణలో కులరాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోంది.
అంతవరకు ఓకే అనుకోగా.. కేవలం బండి సంజయ్ మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన మీద హైకమాండ్ కు పితూరీలు చెప్పడం మాత్రమే ప్రాతిపదిక అన్నట్టుగా కీలకమైన ఇద్దరు నేతలకు కీలకమైన పదవులు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
బండి మీద ఇంచుమించుగా తిరుగుబాటు చేసి, పార్టీ కార్యక్రమాల పట్ల కూడా ఎడమొగం పెడమొగంగా ఉంటూ.. తేడాగా వ్యవహరించిన ఈటల రాజేందర్ కు ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించారు. బండి పట్ల అంతే అసమ్మతి పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏకంగా జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి.. ఆ పార్టీలోకి వెళ్లడానికి మంతనాలు సాగిస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ నిర్ణయం బయటకు వచ్చింది.
అంటే క్రమశిక్షణ గురించి పదేపదే మాట్లాడే భారతీయ జనతా పార్టీ.. నోరున్న వాళ్లకు, పార్టీని బెదిరించే వాళ్లకు పెద్ద పీట వేస్తుందని, పార్టీ హైకమాండ్ కూడా భయపెడితే భయపడుతుందని ఈ నియామకాల ద్వారా నిరూపణ అవుతోంది. ఇలాంటి వ్యవహార సరళి.. సారథ్యం నుంచి తప్పించినందుకు కాదు, ఇంకా అనేక రకాలుగా బండి సంజయ్ ను, ఇన్నాళ్లూ ఆయన పడిన కష్టాన్ని అవమానించినట్లు అవుతుంది. బండికి కూడా ఏదైనా సముచిత స్థానం కట్టబెడితే తప్ప.. బిజెపి హైకమాండ్ తమ చర్యలను ప్రజల ఎదుట సమర్థించుకోవడం కష్టం.