నేతల పాపాల్ని.. వలంటీర్లపైకి మళ్లిస్తున్న జగన్!

Friday, November 15, 2024

జనసేనాని పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరుగుతున్న సకల అరాచకాల్ని చర్చనీయాంశంగా మార్చారు. వాలంటీర్లు ఎలాంటి బాధ్యతగానీ, అధికారిక హోదా గానీ లేకుండా ప్రతి ఇంటికీ తిరిగి ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారనే ఆరోపణలను పవన్ చర్చకు తెచ్చారు. వారు సేకరించిన వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అవుతున్నాయని పవన్ సందేహాలు లేవనెత్తారు. వాటిని వాడుకుని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనేది పవన్ కల్యాణ్ చేసిన సీరియస్ ఆరోపణ. ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు అన్నింటినీ సేకరించి.. హైదరాబాదు నానక్ రామ్ గూడ లోని ఒక ప్రెవేటు సంస్థ ఆధీనంలో ఉంచుతున్నారని కూడా ఆయన చెబుతున్నారు.

ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు సీరియస్ కావడమూ, పవన్ దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి సంఘటనలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఫార్టీ నాయకులు కూడా పవన్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడడం అనేది చాలా సహజంగా జరుగుతూ వచ్చింది.

అయితే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఒకసారి పవన్ వ్యాఖ్యల మీద ఎదురుదాడికి దిగారు. సీఎం జగన్ తనకు సహజమైన రీతిలో పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు. ఈ రోజు ప్రసంగంలో ఆయన కొత్తగా జతచేసిన సంగతి ఏంటంటే.. పవన్ కల్యాణ్ ఒక భార్య ఉండగానే… బయట వేరే అక్రమ సంబంధాలు కూడా మెయింటైన్ చేస్తుంటారని అన్నారు.

అయితే ఆయన తన ప్రసంగంలో తెలివిగా పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల్ని వాలంటీర్ల మీదకు మళ్లించే ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ వాలంటీర్లు సేకరించే సమాచారం ద్వారా.. వైసీపీ నేతలు మహిళ అక్రమ రవాణా చేస్తున్నారని చెబుతూ, వారి ఉచ్చులో వాలంటీర్లు చిక్కుకోకూడదని హెచ్చరించారు. అయితే జగన్ వాలంటీర్ల మీదకు మళ్లిస్తూ.. మన వాలంటీర్లు మహిళలను ప్రలోభపెడుతున్నారా? మన వాలంటీర్లు మహిళలను లోబచరుచుకుంటున్నారా? అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి పవన్ కల్యాణ్ వాలంటీర్లు మీద నేరుగా ఒక్క నింద కూడా వేయలేదు. అయితే జగన్ మాత్రం ఉద్దేశపూర్వకంగా పవన్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా, ఆ ఆరోపణలు తమ పార్టీ కార్యకర్తలమీద, నాయకుల మీద కానే కాదన్నట్లు కలరింగ్ ఇస్తూ.. వాలంటీర్లను రెచ్చగొట్టేలా నిందలను వాళ్ల మీదకు మళ్లించడం అనేది ఒక కుయుక్తి లాగా కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles