ఓట్ల లెక్కింపు జరుగుతోంది.. తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితి లేదని కూడా అనుకుందాం. తెదేపాకు చెందిన నాయకులందరినీ గృహనిర్బంధం చేయడం ఎందుకు? పోలీసులు చెబుతున్నట్లుగా వాళ్లు ఒకవేళ ఇంట్లోంచి బయటకు వచ్చి.. కౌంటింగ్ కేంద్రం వరకు వెళ్లినంత మాత్రాన ఏం జరుగుతుంది. వైఎఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో, వారి అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంటే.. అక్కడ ఈ నాయకులు వెళ్లి తిమ్మిని బమ్మి చేయగల అవకాశం ఏమైనా ఉంటుందా? శాంతి భద్రతల సమస్య సృష్టించగల, అల్లర్లు చేయగల ప్రమాదం ఏమైనా పొంచి ఉందా? అలాంటివేమీ లేకుండానే.. అనంత పురం జిల్లాలోని తెలుగుదేశం నాయకులను గృహ నిర్బంధం చేయడం అనేది ప్రభుత్వం పిరికిపంద చర్య లాగా కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహుశా దారుణమైన షాక్ కు గురై ఉంటుంది. బహుశా ఇంకా వారు ఆ షాక్ నుంచి తేరుకున్నట్టుగా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గంట మోగగానే.. మొత్తం గంపగుత్తగా ఖాళీ అయిన స్థానాలన్నీ తమ ఖాతాలోకి వచ్చిపడిపోతాయని జగన్ బహుశా అనుకుని ఉండవచ్చు. కేవలం స్థానిక ప్రతినిధుల్లో తమకు ఎక్కువ బలం ఉండడం మాత్రమే కాకుండా.. పట్టభద్ర, టీచర్ ఎమ్మెల్సీల్లో కూడా తిరుగుండదని, తమ పథకాలు, నవరత్నాలు తమకు తిరుగులేని మెజారిటీ కట్టబెడతాయని వారు కలగని ఉంటారు. అయితే మొత్తం అంతా తిరగబడింది.
పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నదనే సంగతి ఈ ఎన్నికల్లో బయటపడింది. అంతో ఇంతో పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో మార్జిన్ లో గట్టున పడగలమని వారు తలపోశారో ఏమో.. అక్కడ కూడా దెబ్బపడుతుండే సరికి సహించలేకపోయినట్టున్నారు.
అందుకు తెలుగుదేశం నాయకులను అరెస్టుచేసి, గృహనిర్బంధం చేస్తే ఏమవుతుంది. ఒకవైపు లెక్కింపుజరుగుతుండగానే.. తెదేపా నాయకులను అరెస్టు చేయడం అనేది ప్రభుత్వం పిరికిచర్యగా స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పరాజయాలు.. బహుశా అధికార పార్టీకి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన నూరుశాతం విజయం యొక్క మజాను దూరం చేసేస్తాయి. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ పార్టీ ప్రభుత్వం ఇలాంటి పిరికి నిర్ణయాలు తీసుకోవడమే ప్రజలకు అర్థం కాని సంగతి.
నేతల అరెస్టులు పిరికిపంద చర్య కాదా?
Friday, November 22, 2024