నెల్లూరు జిల్లా రాజకీయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధునికతరం మైండ్ గేమ్ ప్రదర్శిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరేసి పార్టీ నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆయన ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఆయనకు చంద్రబాబు అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని ఆ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బలహీనపరచడానికి, ఆయన వర్గాన్ని, అనుచరులను అయోమయంలోకి నెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తిరస్కరించింది, ఆయనను తమ జట్టులో చేర్చుకోవడం లేదు, ఆయన ఇలా నాలుగు రోడ్ల కూడలిలో మిగిలిపోతున్నారు.. అనే తరహా ప్రచారాన్ని నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాలలో, సోషల్ మీడియాలో విస్తృతంగా సాగిస్తున్నారు! ఈ ప్రచారం వలన ఆయన అనుచరులు గందరగోళానికి గురవుతున్నారు. అధికార పార్టీలకి కావలసినది కూడా అదే. శ్రీధర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం పట్ల స్పష్టత ఉంటే.. అనుచరులందరూ ఆయన వెన్నంటే ఉంటారు. ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అనే అనుమానాలను నాటగలిగితే అనుచరులు నాయకుడిని పట్టించుకోకుండా తమ పార్టీలోనే కొనసాగుతారనేది వైసిపి వ్యూహం.
అయితే ఇప్పటికి ఇంకా అధికారికంగా ప్రకటించుకోవడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి గానీ.. కోటంరెడ్డి తెలుగుదేశంలో చేరడం అనేది ఖరారే అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కోటంరెడ్డి ప్రస్తుతం వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే గనుక.. పచ్చకండువాతో తిరగడం అనర్హతకు దారితీయకుండా చూసుకుంటున్నారు. అయితే ఈ గ్యాప్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది.
ఎమ్మెల్యే కాక ముందునుంచి కూడా చురుగ్గా ప్రజల్లో మెలిగే నాయకుడిగా పేరున్న కోటంరెడ్డికి అనుచరుల బలం ఎక్కువే. వారిలో చాలా మంది స్వతహాగా వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులే అయినప్పటికీ.. పార్టీమీద ఉండే ప్రేమను మించి వారిని కోటంరెడ్డి ఆకట్టుకోగల నాయకుడే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం అంటూ జరిగితే.. ఖచ్చితంగా వైసీపీ కేడర్ వలసవెళ్తుంది. ఇప్పటికే పలువురు అక్కడి నాయకులు కోటంరెడ్డి కోటరీలో చేరిపోయారు. వారిలో ఒక గందరగోళాన్ని సృష్టించడం కోసం, కోటంరెడ్డిని తెలుగుదేశంలో చేర్చుకోవడం లేదు, మీ బతుకులు అన్యాయం అయిపోతాయి.. ఆయన వెంట వెళ్లొద్దు అంటూ కార్యకర్తలను మాయ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఈ మైండ్ గేమ్ ప్రారంభించినట్టుగా అంతా అనుకుంటున్నారు.