2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో ఘనవిజయం సాధించడం వెనుక నెల్లూరు జిల్లా పాత్ర కూడా ఉంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అస్సలు ఒక్క సీటు కూడా దక్కలేదు. జిల్లా మొత్తం జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలను గమనిస్తోంటే.. 2019 నాటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ కావడం కష్టం అనిపిస్తోంది. నెల్లూరు రాజకీయాలు ఈసారి జగన్మోహన్ రెడ్డికి షాక్ఇవ్వడం గ్యారంటీ అని పలువురు విశ్లేషిస్తున్నారు.
జిల్లాలో అనేకమంది సిటింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కొందరి మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కలిసి పార్టీకి దక్కగల విజయావకాశాలమీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.
ప్రధానంగా ఆనం ఫ్యాక్టర్ గురించే చర్చ జరుగుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి బంధం తెగిపోయినట్టే. ఆయనను పూర్తిగా పక్కన పెట్టిన సంగతి ప్రజలందరికీ అర్థంకావడానికి వీలుగా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్చార్జిగా నేదరుమల్లి రాంకుమార్ రెడ్డిని పార్టీ నియమించేసింది. ఆనం రామనారాయణ రెడ్డి కూడా తెలుగుదేశం లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన పార్టీలో చేరడం కేవలం లాంఛనమే. అయితే 2024 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి కాకుండా మరో సీటునుంచి ఆయన పోటీచేయాలని అనుకుంటున్నారు.
ఆయన ఏ సీటు అడిగినా తెలుగుదేశం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. పైగా, వైఎస్సార్ హయాంలో ఆయనకు విశ్వసనీయుడైన మంత్రిగా కూడా సేవలందించిన ఆనం రామనారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావంచూపగలిగిన నాయకుడు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకు తనదంటూ కొంత ఓటు బ్యాంకు ఉంటుందనేది పలువురి విశ్లేషణ. అలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారితే.. తెలుగుదేశానికి ప్రతిచోటా కొంత ఎడ్వాంటేజీ ఏర్పడుతుంది.
గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్.. బయటపడకపోయినప్పటికీ ఎప్పటినుంచో వైసీపీపట్ల విముఖంగా ఉన్నారు. తాజాగా కోటంరెడ్డి స్వరం పార్టీ మీద తిరుగుబాటులాగా ధ్వనిస్తోంది. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తీరు మీదనే ఇటీవల విరుచుకుపడిన కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తర్వాత వెళ్లి సీఎం జగన్ ను కలిశాక కొంత శాంతించారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జిల్లా రాజకీయాల్లోని పది పెద్ద కుటుంబాలు తన గొంతు కోశాయని అనడం సంచలనాత్మకం అవుతోంది. ఆయనను పిలిపించినప్పుడు జగన్ ఏం అన్నారో తెలియదు గానీ, ఇప్పుడు కోటంరెడ్డి మాటలు పార్టీ మీద ధిక్కారం లాగానే ఉన్నాయి. జిల్లాలోని రాజకీయ కుటుంబాల మీద ఆయన ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. మరి ఆయనలో అసంతృప్తి స్థాయి ఏమిటో.. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు.
ఇలాంటి రకరకాల కారణాల దృష్ట్యా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా షాక్ ఇస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
నెల్లూరు రాజకీయం వైకాపాకు షాకిస్తుందా?
Wednesday, January 22, 2025