నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరదించారు. మూడుతరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేస్తోంటే.. వారు తనను వేధిస్తున్న తీరు కలచివేసిందని ప్రకటించారు. అనుమానం ఉన్నచోట కొనసాగలేం అని.. ఆయన వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేసే అంశాన్ని చూచాయగా ప్రకటించారు. వైసీపీ తమ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని కూడా అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తన తమ్ముడు గిరిధర్ రెడ్డికి టికెట్ ఇస్తే గనుక.. తాను అసలు పోటీచేయనని, రాజకీయాలనుంచే తప్పుకుంటానని కూడా ప్రకటించారు. అలాగే కార్యకర్తలతో తాను విడిగా నిర్వహించుకున్న సమావేశంలో.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గం నుంచే పొటీచేస్తానని ఆయన ప్రకటించేశారు. ఈ పరిణామాలు అన్నీ.. అంచెలంచెలుగా జరిగాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెగింది.
అయితే సహజంగానే ప్రజలతో కలసిమెలసి ఉంటే నాయకుడు, ప్రజాసమస్యల కోసం అధికారులతో గట్టిగా పోరాడగల, దూకుడుగా వ్యవహరించగల నాయకుడిగా కోటంరెడ్డికి పేరుంది. కొన్ని మంచి లక్షణాలున్న నాయకుడిగా కూడా పేరుంది. కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ.. ప్రజల వద్ద అవినీతికి పాల్పడని వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఇలాంటి నాయకుడు.. తెలుగుదేశం లో చేరితే.. వైసీపీకి నెల్లూరు జిల్లాలో కష్టాలు తప్పవనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
నిజానికి నెల్లూరు జిల్లాను వైసీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఆ పరిస్తితి లేదన్నది స్పష్టం. సిటింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు కొందరు తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంది. ఎన్నికల్లోగా ఈ నిర్ణయాలు బయటకు రావొచ్చు. ఆల్రెడీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం తేలిపోయింది. తెలుగుదేశంలో చేరబోతున్నట్టుగా ఆయన ఇంకా తేల్చిచెప్పలేదు గానీ.. వైసీపీ ఆయనను వదిలించుకున్నట్టే. ఆయన స్థానంలో పార్టీ మరో ఇన్చార్జిని కూడా అక్కడ నియమించేసింది. ఇప్పుడు కోటంరెడ్డి వంతు వచ్చింది. ఆయన తాను తెలుగుదేశంలో చేరుతానని తెగేసి చెప్పేశారు. కానీ ఈ ఇద్దరు నాయకుల వలన వైసీపీకి జరగగల నష్టంలో వ్యత్యాసం ఉంది. ఎందుకంటే.. ఆనం చాలా మెత్తగా, శాస్త్రోక్తంగా విమర్శలు చేస్తుంటారు. కానీ కోటంరెడ్డి తీరు అలాంటిది కాదు. నెల్లూరు జిల్లాలో వైసీపీ మంత్రిస్థాయి నేతలు అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్దన్ రెడ్డి లాంటి వాళ్ల మీద నిప్పుల్లాంటి విమర్శలతో విరుచుకుపడతారు. పైగా నెల్లూరు జిల్లాలో కొందరు వైసీపీ నాయకులతో ఆయనకు ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. పార్టీలో ఉండగానే వారి అవినీతిని పలు సందర్భాల్లో ప్రశ్నిస్తూ వచ్చారు. ఇప్పుడిక తెలుగుదేశంలో చేరిన తర్వాత.. జిల్లా రాజకీయాలకు సంబంధించినంత వరకు వైసీపీ వారిని ఎవ్వరినీ విడిచిపెట్టరని, ఇక దబిడిదిబిడే అని పలువురు భావిస్తున్నారు.
నెల్లూరు పచ్చదళంలోకి కోటంరెడ్డి.. దబిడిదిబిడే!
Friday, November 22, 2024