2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా అన్ని సీట్లను సమర్పించుకున్న నెల్లూరు జిల్లాలో ఈసారి వాతావరణం ఏమాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. కొత్తగా తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుని దెబ్బ కొట్ట గల స్థానాలు ఎన్ని ఉంటాయో ఏమో తర్వాతి సంగతి. పార్టీలోనే ముసలం పుట్టి తమలో తామే కొట్టుకుని పార్టీకి చేటు జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్,డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశంలో చేరబోతున్న సంగతి ఖరారు అయింది. తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. అవసరమైతే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని పార్టీని, జగన్ ను హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని నియమించిన పరిశీలకుడి వ్యవహారం అక్కడ ఈ తాజా ముసలం పుట్టడానికి కారణం కావడం గమనార్హం!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నిర్వహణలో తనదైన భిన్న ధోరణులను అనుసరిస్తున్నారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ తరఫున పరిశీలకులను, పార్టీ ఇన్చార్జీలను వేరుగా నియమిస్తూ వారికి ప్రత్యామ్నాయ శక్తులు ఉన్నాయనే భావనను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. సహజంగానే ఇది ఆయా నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కంటగింపు గానూ, కడుపు మంటగాను మారుతోంది.
కొన్ని నియోజకవర్గాలలో ఇలాంటి వాతావరణం ఏర్పడడానికి కారణాలు ఏమైనప్పటికీ జగన్ కుటుంబానికి అత్యంత విధేయులు అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరిలో కూడా ఇలాంటి ముసలం పుట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వారి పార్టీలోనే చర్చనీయాంశం అవుతోంది. రాబోయే ఏడాది కాలవ్యవధిలో ఇంకా ఎందరు ఎమ్మెల్యేలకు జగన్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారో అని తమలో తాము చెవులు కొరుక్కుంటున్నారు.
తన నియోజకవర్గంలో పార్టీ నియమించిన పరిశీలకుడు ధనంజయరెడ్డి తనకు వ్యతిరకంగా పార్టీలో గ్రూపులను పెంచి పోషిస్తున్నారంటూ.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడినైన తన మీద ఎవరో వచ్చి పెత్తనం చేయాలంటే కుదరదని కూడా హెచ్చరించారు. ధనంజయరెడ్డిని వెంటనే తొలగించాలని సీఎం జగన్ ను ఇటీవల కలిసి కోరినట్లుగా కూడా ఆయన ప్రకటించారు. అయితే జగన్ ఆయన విన్నపాలను పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ధనంజయరెడ్డి ఇలాగే కొనసాగితే.. వర్గాలు పెరిగే అవకాశం ఉంటుందన్న చంద్రశేఖరరెడ్డి ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్ధంగా ఉంటానని హెచ్చరిస్తున్నారు. అంటే తానుకూడా పార్టీని వీడడానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారా అనే అనుమానాలు పుడుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రెండు వికెట్లు పడ్డాయి. మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా గుడ్ బై చెబితే మూడు వికెట్లు పడినట్టు అవుతుంది.
నెల్లూరు జిల్లాలో మరో వికెట్ పడుతుందా?
Wednesday, November 13, 2024