నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుతోంది. బాబాయి- అబ్బాయిల లడాయి శృతిమించి.. ఒకరి గురించి ఒకరు ప్రజల్లో నెగటివ్ ప్రచారం చేసేదాకా వెళ్లింది. తను వృద్ధిలోకి తీసుకువచ్చిన నాయకులు ఇవాళ తనమీద తిరుగుబాటు బావుటా ఎగరేసి, తోక జాడిస్తున్నారనే అభిప్రాయంతో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తను అనుకూలంగా పార్టీ కేడర్ ను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఆయన తాజాగా కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సొంత పార్టీ వాళ్లే నా వెనుక గోతులు తవ్వుతున్నారంటూ ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు తనను వీడి వెళ్లిపోయినా 2024 ఎన్నికల్లో కూడా గెలిచి తీరుతానిన అనిల్ యాదవ్ ప్రతిజ్ఞ చేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి అనిల్ కు ఆయనకు వరుసకు బాబాయి అయ్యే మరో వైసీపీ నాయకుడు రూప్ కుమార్ యాదవ్ కు ఇటీవలి కాలంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఏర్పడింది. అనిల్ కు వ్యతిరేకంగా.. రూప్ కుమార్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నారు. అంటే పార్టీ అధికారిక కార్యాలయం కాకుండా, జగనన్న భవన్ పేరుతో ఆయన సొంత ఆఫీసు పెట్టుకున్నారు. నిజానికి బాబాయి అబ్బాయిల మధ్య చాలా కాలంగా ఉన్న తగాదాలు పార్టీ పరువు తీస్తున్నాయని భావించిన జగన్ స్వయంగా ఇరువురినీ పిలిపించి మాట్లాడినప్పటికీ అక్కడ పరిస్థితిలో ఏం తేడా రావడం లేదు.
ఇద్దరు నాయకులు కూడా తాము వైసీపీలోనే ఉంటాం అని, పార్టీని వీడేది లేదని అంటున్నారు. కాగా, నెల్లూరు వుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకనాధ్, సీనియర్ నాయకుడు వైవి రామిరెడ్డి లాంటి వాళ్లు కూడా ఇప్పుడు అనిల్ కుమార్ కు వ్యతిరేక గ్రూపుగా మారారు. అందరూ కలిసి, రాబోయే ఎన్నికల్లో తాను గెలవలేనని పార్టీ అధినేత వద్ద దుష్ప్రచారం చేస్తున్నారని అనిల్ ఆరోపిస్తున్నారు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తానని కూడా అంటున్నారు.
అయితే గత 2019 ఎన్నికల సమయంలో పార్టీలోని అన్ని వర్గాల నాయకులు కలసికట్టుగా కష్టించి పనిచేస్తేనే రెండువేల ఓట్ల మెజారిటీతో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా బయటపడ్డారు అనిల్ కుమార్ యాదవ్. మంత్రిగా హోదా వెలగబట్టినప్పటికీ.. సొంత నియోజకవర్గానికి పెద్దగా మేలు చేయలేకపోయారనే అభిప్రాయం ఆయన సొంత పార్టీ వారిలో కూడా ఉంది. బాబాయి రూప్ కుమార్ యాదవ్– అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ ల లడాయిలో ఎవరు నెగ్గుతారో? గెలిచి తీరుతానంటున్న అనిల్ ఏ రకంగా అందుకు తగిన బలాలను సమకూర్చుకుంటారో వేచిచూడాలి.