అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే.. పోలీసు యంత్రాంగం సహజంగా వారి కనుసన్నల్లో పనిచేస్తుంటుంది. పోలీసు వ్యవస్థను ఏ లెవెల్లో దుర్వినియోగం చేస్తున్నారనే దాన్ని బట్టి ప్రభుత్వాల మంచి చెడులు ఆధారపడి ఉంటాయే తప్ప.. ఎవ్వరు ఇందుకు అతీతంగా వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వ్యవహరించరు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత వైసీపీ ఏలుబడిలో కూడా పోలీసు వ్యవస్థ పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారంటూ.. అనేకానేక విమర్శలు తొలినుంచి ఉన్నాయి. విపక్షాల పట్ల ప్రతి సందర్భంలోనూ వారు వ్యవహరించే వైఖరి కూడా ఇలాంటి విమర్శలకు ఊతమిచ్చే విధంగానే సాగుతూ ఉంటుంది. ఇప్పుడు పోలీసులు విపక్షాల పట్ల వ్యవహరించడంలో ఒక సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది.
విపక్ష ఉద్యమాల విషయంలో పోలీసులు వారిని అడ్డుకోవడం, పోలీసులను నాయకులు ప్రతిఘటించడం ప్రతిచోటా జరిగేదే. దానికి సంబంధించి కేసులు నమోదు కావడం అరుదుగా కానీ జరగదు. ఇటీవలి కాలంలో పోలీసులు ఎదురు కేసులు పెడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో తమ విధులకు ఆటంకం కలిగించారు అనే సెక్షన్ల కింద కేసులు పెట్టడానికి వారికి అన్ని అవకాశాలూ ఉంటాయి. కానీ, విపక్షాలనుయ మరింత గట్టిగా టార్గెట్ చేయడం లక్ష్యంగా పోలీసులు మరో వ్యూహాన్ని, కొత్తరకం సెక్షన్లను ఎంచుకోవడమే చిత్రంగా కనిపిస్తోంది.
తెలుగుదేశం నాయకులు పోలీసులను ప్రతి ఘటిస్తే చాలు.. ఇప్పుడు ‘హత్యాయత్నం’ కేసులు నమోదు అవుతున్నాయి. అదేమిటి ఎంతచెడ్డా వాళ్లు మామూలు రాజకీయ నాయకులే.. బహిరంగంగా అది కూడా పోలీసులను హత్య చేయడానికి ప్రయత్నిస్తారా? ఇది నమ్మశక్యమేనా? అని విస్తుపోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ప్రజల నమ్మకాలతో వారికి నిమిత్తం లేదు. వారు కేసులు బనాయించడానికి అనువుగా సెక్షన్లు ఉన్నాయా? లేదా? ఆ సెక్షన్లలో ఇరికించడానికి తగినవిధంగా అక్కడ వ్యవహారం నడిచిందా లేదా అనేది మాత్రమే వారికి ముఖ్యం. ఏకొంచం అనుకూలంగా ఉన్నా చాలు.. అంటే పోలీసు అధికారుల్ని వెనక్కి నెట్టినా, వారి చేతుల్లో జెండాకర్రలు ఉండగా ప్రతి ఘటించినా.. అలాంటి ప్రతి సందర్భాన్ని కూడా హత్యాయత్నం కింద జమకడుతున్నారు.
విపక్షాల గొంతు నొక్కడానికి జీవో నెం.1 అమల్లోకి వచ్చిన తర్వాత.. కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటనకు ఆంక్షలు విధించినప్పుడు తొలిసారిగా ఈ దారుణం అమల్లోకి వచ్చింది. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగిన, ఆంక్షలను ప్రతిఘటించిన తెలుగుదేశం కార్యకర్తలపై పదుల సంఖ్యలో హత్యాయత్నం కేసులను నమోదు చేశారు.
ఇక ఆ కేసులో ఉండే పట్టు,కీలకం పోలీసులకు వంటబట్టినట్టుంది. తాజాగా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. బంగారుపాళెంలో ఆంక్షలను అతిక్రమించి.. మైకులు పెట్టి సభ నిర్వహించారు. వాహనాలను, స్టూలును కూడా సీజ్ చేశారు. దానితో పాటు లోకేష్ సహా పలువురి మీద పోలీసు అధికారిపై హత్యాయత్నం కేసు పెట్టారు.
ఈ లెక్కన గమనిస్తే.. ఈ పాదయాత్ర పూర్తయ్యేలోగా నారా లోకేష్ మీద పదుల సంఖ్యలోనో, వందల సంఖ్యలోనో హత్యాయత్నం కేసులు నమోదు అయ్యేలా కనిపిస్తోంది.
నెక్ట్స్ లెవెల్ పోలీస్ స్ట్రాటెజీ ‘హత్యాయత్నం’!
Wednesday, January 22, 2025