కారణాలు ఏమైనా కావొచ్చు గాక.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనుంచి.. లక్షల కోట్ల రూపాయల సంక్షేమం అమలు చేస్తున్నామని.. అయిదు కోట్ల మంది తెలుగుప్రజలు తమను నెత్తిన పెట్టుకుంటున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఢంకాబజాయించి మరీ మరోసారి ఘనవిజయం కట్టబెడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెబుతుంటారు. ఆయన మాటల్ని ఎవరు నమ్ముతున్నారో తెలియదు గానీ, మొత్తానికి అధికార పార్టీ నుంచి అనేకమంది సిటింగ్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ వీడబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. తన పాలనకు ఉన్న మంచి పేరు గురించి జగన్ ఇంతగా డప్పుకొట్టుకుంటూ ఉండగా.. సొంత టీమ్ లోని వాళ్లు పక్క చూపులు చూస్తుండడం ఆయనకు అవమానకరమే.
జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన అనేక సందర్భాల్లో.. సర్వేలు చేయించుకుంటాను, సర్వేల్లో తేడా వస్తే పక్కన పెట్టేస్తాను అని బెదిరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మీరందరూ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీచేయాల్సిందే.. ఈ టీమ్ ఇలా ఈ దఫా కొనసాగాలి అని కూడా అంటుంటారు. కానీ.. వాస్తవంలో ఉండవల్లి శ్రీదేవి వంటి ఒకరిద్దరిని తప్ప జగన్ పక్కన పెట్టిన ఎమ్మెల్యేలు లేరు. కానీ ఈసారి ఎన్నికలే వద్దనుకుంటున్న సిటింగ్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చాలామంది ఉన్నారు. అసలు ఈ పార్టీనే వద్దనుకుంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా తాము సొంత దారిచూసుకుంటున్నామని సంకేతాలు ఇస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డికి గానీ, చెవిరెడ్డి భాస్కర రెడ్డికి గానీ 24లో పోటీచేసే ఉద్దేశం లేదు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి వాళ్లో బోలెడు మంది ఉన్నారు. అలాగని వారు పార్టీ వీడి వెళ్లరు.
పార్టీనే వద్దనుకుంటున్న వారు కూడా చాలా మందే తయారవుతున్నారు. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఆనం రామనారాయణ రెడ్డి, వరప్రసాద్ అధికార పార్టీలో కొనసాగే అవకాశం లేదు. వసంత కృష్ణ ప్రసాద్ పరిస్థితి కూడా డౌటే. ఆనంకు అసంతృప్తి ఉందని అనుకోవచ్చు గానీ.. జగన్ సర్కారు ఏర్పడగానే తొలిసారిగా హోంమంత్రిని చేసిన సుచరిత కూడా పోకకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సుచరిత భర్త మాజీ ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ రావు బాపట్ల ఎంపీగా బరిలోకిదిగాలని, తెలుగుదేశం వారితో మంతనాల్లో ఉన్నారు. మా ఆయన ఎటు వెళ్తే నేనూ అటే వెళ్లాలి కదా.. భార్య ధర్మం కదా.. అని మేకతోటి సుచరిత ధర్మపన్నాలు వల్లిస్తున్నారు. తనను కేబినెట్ విస్తరణలో పక్కన పెట్టినప్పటినుంచి అలకపూని ఉన్న సుచరిత తాజాగా పార్టీ మార్పు సంకేతాలు కూడా ఇవ్వడం గమనార్హం. జగనేమో నేను మళ్లీ గెలుస్తున్నా.. ఇంకో ముప్ఫయ్యేళ్లు అధికారంలోనే ఉంటా అని అంటుంటారు. కానీ.. ఈ మాటలతో నాలుగేళ్లుగా తనతో ఉన్న ఎమ్మెల్యేలను కూడా నమ్మించలేకపోతున్నారు. కారణాలు ఏమైనా కావొచ్చు గాక.. సిటింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతే జగన్ కు అది అవమానమే.
నిష్క్రమణలు జరిగితే జగన్ కు అవమానమే!
Tuesday, November 26, 2024