నిర్బంధాలు: భయపెడుతున్నారా? భయపడుతున్నారా?

Sunday, December 22, 2024

ఏపీలో చాలా చిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. బూతులు, అసహ్యమైన మాటలు, అసహ్యమైన ఆరోపణలు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని కూడా కాదు, స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి ఏదైనా రాజకీయ విమర్శను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే చాలు.. ఆ ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు తీసుకెళ్లి కుళ్లబొడిచి వొదిలేస్తారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం విపక్ష నాయకులు చిన్న దీక్ష, ఉద్యమం చేయాలనుకుంటే చాలు.. ఆ పని జరగనివ్వకుండా వారిని ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసేస్తారు. ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి?
విమర్శలు, ప్రజా ఉద్యమాలు అంటే.. వాటితో తమ ప్రభుత్వానికి మూడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు భయపడుతున్నదా? లేదా, అలాంటి ఉద్యమాలు చేసేవారిని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నదా? అనేది అర్థం కావడం లేదు.

సోషల్ మీడియాలో చిన్న చిన్న విమర్శలు పెట్టినందుకు పోలీసు కేసులు నమోదు చేయడం, అది కూడా ఎమ్మెల్యే ఒత్తిడితో వైసీపీ కార్యకర్తనే పోలీసులు చితక్కొట్టడం వంటి వ్యవహారాలు ఒక ఎత్తు. అదే సమయంలో ప్రజల కోసం చిన్న డిమాండ్ ను దీక్ష రూపంలో వినిపించాలని సాక్షాత్తూ ఎమ్మెల్యే అనుకుంటే గృహనిర్బంధం చేయడం ఇంకో ఎత్తు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, జగన్ మీద తిరుగుబాటు ప్రకటించి సస్పెన్షన్ కు గురైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా ఒక ప్రజాసమస్యపై దీక్ష చేయదలచుకున్నారు. పొట్టెపాలం కలుజువద్ద వంతెన నిర్మాణం చేయాలంటూ.. 8 గంటల జలదీక్ష చేయదలచుకున్నారు. నిజానికి ఇది చిన్న సమస్య, చిన్న దీక్ష! దీనిని కూడా ప్రభుత్వం సహించలేకపోయింది. ఆ నిరసన తెలియజేయడానికి ఆయన వెళ్లబోతుండగా.. పోలీసులు ఆయనను ఇంటివద్దనే నిర్బంధించారు. అనుచరులు కూడా పెద్దసంఖ్యలో చేరుకోవడంతో, పోలీసులు తగినట్టుగా మోహరించారు. జలదీక్ష చేయడానికి వీల్లేదంటూ గృహ నిర్బంధం చేశారు.

ప్రజాసమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజాప్రతినిధి చేసే ప్రయత్నాన్ని కూడా ఇంత అనుచితంగా అడ్డుకుంటూ ఉంటే ప్రభుత్వానికి ప్రజల్లో ఏం మర్యాద దక్కుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటివి లెక్కకు మిక్కిలిగా తయారవుతున్నాయి.

అయితే.. ఇలాంటి నిర్బంధాలు గతంలో చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. అయితే.. నిరసన కార్యక్రమం దీక్ష/పోరాటం పెద్దస్థాయిలో ఉంటుందనుకుని, అది అదుపు తప్పి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే భయం ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం అడ్డుకునేది. కానీ కోటంరెడ్డి చేయదలచుకున్నది చాలా చిన్నది. 8 గంటల జలదీక్ష. కలుజు వద్ద వంతెన కట్టాలని కోరుతున్న చిన్న డిమాండు. పోగయ్యే జనం కూడా తగినట్టే ఉంటారు. అయినాసరే ప్రభుత్వం జడుసుకుని.. వారిని నిర్బంధించడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles