ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ తరఫున నాగేంద్రబాబు మరింత యాక్టివ్ గా రంగంలోకి దిగుతున్నారు. ఇటీవలి కాలంలో అడపాదడపా కార్యకర్తలతో సమావేశం అవుతున్న నాగబాబు.. తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఒక కీలకవిషయం కూడా బయటపెట్టారు. చాలాకాలంగా పార్టీలో నలుగుతున్నదే అయినా.. మరోమారు ఆయన స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయబోవడం లేదని నాగబాబు చెప్పారు. గత ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత చాలాకాలంగా రాజకీయాల, పార్టీ జోలికి రాలేదు గానీ.. కొంత కాలం నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. కార్యకర్తలను సమీకరించడంలో, శ్రేణులతో సమావేశాలు నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. నాగబాబు ఎన్నికల్లో బరిలోకి దిగకపోవడం అంటే పార్టీకోసం త్యాగం చేస్తున్నట్టే.
ఎందుకంటే.. తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడానికి జనసేన సిద్ధమైన నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయనే స్పష్టత ఇంకా లేదు. అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంది గనుక.. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లకోసం ఎక్కువ పట్టుపట్టే అవకాశం ఉంది. అదే ఎంపీ సీట్ల విషయంలో వారికి పరిమితంగానే దక్కవచ్చు. దక్కే పరిమితమైన సీట్లను పార్టీ ముఖ్యులకు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఎంపీ సీటుకు మాత్రమే తగిన నాయకులు పవన్ కల్యాణ్ దృష్టిలో ఉంటారు. అలాంటి నేపథ్యంలో.. ఉన్న పరిమితమైన అవకాశాలను కుటుంబసభ్యుడిగా నాగబాబు దక్కించుకుంటే అది పార్టీకి చెడ్డపేరు తెస్తుందని ఆయన ఈ త్యాగం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
నిజానికి నాగబాబు చేస్తున్న ఇలాంటి త్యాగం వలన మరో ఎడ్వాంటేజీ కూడా ఉంది. ఆయన విస్తృతంగా రాష్ట్రమంతా తిరిగి జనసేన అభ్యర్థులు ఉన్నదగ్గర ప్రచారం నిర్వహించవచ్చు. పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో కలిసి అన్నిచోట్లా తిరగాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో జనసేన అభ్యర్థులు ఉన్నచోట్ల మాత్రం డెడికేటెడ్ గా ఫోకస్ పెట్టడానికి నాగబాబు వారికి ఉపయోగపడతారు. ఆ రకంగా నాగబాబు త్యాగం పార్టీకి లాభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నాగబాబు త్యాగం జనసేనకు లాభిస్తుందా?
Sunday, January 19, 2025