నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా సేవలందించిన రోజుల్లో కూడా ఒక చిన్న సమస్య ఉండేది. ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సి వస్తే ఆయన కాస్త గందరగోళానికి గురయ్యేవారు. దాదాపు పదేళ్లు గడిచిపోతున్నా ఆయన తీరులో మాత్రం ఏమీ మార్పు వచ్చినట్లుగా లేదు. తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఏ రాష్ట్రాన్ని ప్రధాన వేదికగా మార్చుకుని తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాలని అనుకుంటున్నారో ఆయనకు ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.
కమల తీర్థం పుచ్చుకున్న తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కిరణ్ కుమార్ మొదటి ప్రెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించారు. ఆయన ఒకప్పటిలో చిత్తూరు జిల్లా వాయల్పాడు ఎమ్మెల్యే గనుక, తొలి ప్రెస్ మీట్ విజయవాడలో పెట్టారు కనుక.. తనను ఏపీ రాజకీయాలకు పరిమితమైన నేత అని ఎవరైనా అనుకుంటారేమో అని ఆయన ఆందోళన చెందినట్టు ఉన్నారు. ఎందుకంటే తాను మూడు రాష్ట్రాలకు కూడా సొంతమైన నాయకుడిని అని ప్రత్యేకంగా ప్రస్తావించుకున్నారు. ఆ మూడింటిలోనూ కర్ణాటకలో సొంత ఇల్లు ఉన్నదనే మాట తప్ప మరొక విషయమేమీ లేదు. అదే తెలంగాణ విషయానికి వస్తే.. తెలంగాణ కూడా తనకు సొంత రాష్ట్రం అని అక్కడే పుట్టానని తన స్కూలు కాలేజీ అన్ని అక్కడే చదివానని కిరణ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
చూడబోతే తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి నాయకుడిగా ముద్ర వేయకూడదని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. పార్టీకి తన సేవలు ఏ రాష్ట్రంలో అవసరమైతే అక్కడ వారు సూచించిన మేరకు అందిస్తానని ఆయన ఔదార్యం ప్రదర్శిస్తున్నారు.
చూడబోతే తెలంగాణ కమల రాజకీయాల మీదనే కిరణ్ కు మక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ బిజెపి ఏదో ఒక నాటికి అధికారంలోకి వస్తుందని నమ్మకం ఆయనకు ఉన్నట్టుంది. అందుకే ప్రెస్ మీట్ విజయవాడలో పెట్టినా కూడా తెలంగాణ రాజకీయాల మీద తన ఆసక్తిని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.