వినేవాళ్లు వెర్రివాళ్లయితే చెప్పేవాళ్లు ఎన్ని కోతలైనా కోస్తారు. తనను గెలిపిస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకసారి ప్రజలను బురిడీ కొట్టించారు. ఇప్పుడు ప్రజలను పూటుగాతాగించకపోతే ప్రభుత్వం మనగలుగుతుందో లేదో అనే స్థితిలో వ్యవహారాలు నడుస్తున్నాయి. కొత్తగా బార్లకు కూడా అనుమతులు ఇచ్చేసి.. చెలరేగిపోతున్నారు. రాష్ట్రంలో మద్యం ప్రవాహాలు విచ్చలవిడిగా మారుతున్న సమయంలో, డిప్యూటీ ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఇంకా ప్రజలను బురిడీ కొట్టించగలం అని అనుకుంటున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. ‘2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసేస్తామో లేదో మీరే చూడండి’ అంటున్నారు.
‘అక్కచెల్లెమ్మలకు మాటఇస్తున్నా’ అంటూ తన పాదయాత్ర సమయంలోనూ, ఎన్నికలప్రచార సమయంలోనూ జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా ప్రకటించారు. మద్యనిషేధం అంటే సహజంగానే మహిళల్లో పాజిటివ్ ట్రెండ్ ఏర్పడుతుంది. రాష్ట్రంలోని స్త్రీలందరూ నిజమే అనుకున్నారు. జగన్ గెలిస్తే మద్యనిషేధం అమల్లోకి వస్తుంది. తమ కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నారు. కానీ జగన్ గెలిచిన తర్వాత.. చాలా కన్వీనియెంట్ గా ఇచ్చిన మాటను మర్చిపోయారు.
ప్రారంభంలో కొన్ని లిక్కర్ షాపుల సంఖ్య తగ్గించడం ద్వారా హడావుడి చేశారు. ఇదంతా సంపూర్ణ మద్యనిషేధం సాధించే దిశగా తొలి అడుగు అని ప్రకటించారు. ప్రజలు నమ్మారు కూడా. దశల వారీగా మద్యం షాపులు చాలా తగ్గుతాయని, అయిదేళ్ల పాలన పూర్తయ్యేసరికి కేవలం స్టార్ హోటళ్లు వంటి కొన్నిచోట్లకు మాత్రం పరిమితం అవుతూ.. దాదాపుగా సంపూర్ణ మద్యనిషేధాన్ని రాష్ట్రంలో తీసుకువస్తాం అని వైసీపీ నాయకులు ఊదరగొట్టారు. కానీ అవన్నీ కల్లమాటలే అని అనతికాలంలోనే తేలిపోయింది.
తర్వాతి లిక్కర్ ధరలను విపరీతంగా పెంచేసి, లోకల్ బ్రాండ్లను పెద్దసంఖ్యలో మార్కెట్లోకి తరలించిన సమయంలో కూడా.. ఆ చర్యలన్నీ మద్యనిషేధం దిశగా అడుగులే అని బుకాయించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ధరలు పెంచడం వల్ల అలవాటు మాన్పిస్తాం అని చెప్పింది. అవేమీ జరగకపోగా.. మళ్లీ ధరలు తగ్గించిన సర్కారు.. ఇప్పుడు బార్లను కూడా పెంచింది. కొత్త బార్లకు లైసెన్సులిచ్చింది. మద్యం ఆదాయం లేకపోతే మనగలగడం కష్టం అన్నట్టుగా ప్రభుత్వం తేటతెల్లంగా ప్రవర్తిస్తుండగా… డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాత్రం 2024 ఎన్నికల నాటికి లిక్కర్ షాపులు మూసేస్తామో లేదో చూడండి.. అని డాంబికంగా పలుకుతున్నారు. తాము మాటలు చెబితే ప్రజలు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారని వైసీపీ నాయకులు భావిస్తున్నారేమో ప్రజలకు అర్థం కావడం లేదు.
నమ్మండి ప్లీజ్ : ఏపీలో మద్యం షాపులు మూసేస్తారట!
Thursday, November 14, 2024