నడ్డా, అమిత్ షాలను నమ్మొద్దు, వచ్చేయండి!

Sunday, December 22, 2024

తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. కాంగ్రెసు పార్టీ గేరు మార్చుతోంది. కర్ణాటక ఎన్నికలన తర్వాత.. ఇప్పటికే తెలంగాణలో చాలా మంది ఆ పార్టీ వైపు చూస్తున్నట్టుగా వాతావరణం మారుతోంది. షర్మిల విలీనం గురించి కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపి నాయకులు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెసులోకి వచ్చేస్తారనే ప్రచారం మొదలైంది. అయితే కాంగ్రెసులాగానే.. కేసీఆర్ ను మట్టి కరిపించి.. తెలంగాణలో గద్దె ఎక్కాలని తపన పడుతున్న బిజెపి.. వారు తమ పార్టీ వీడిపోకుండా నష్టనివారణ చర్యలు తీసుకుంది. వారిద్దరినీ ఢిల్లీ పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడింది.

తాజాగా రేవంత్ రెడ్డి మాటలను గమనిస్తే.. బిజెపి అసంతృప్త నాయకుల ఢిల్లీ పర్యటన పెద్ద ఫలితం ఇచ్చినట్టుగా లేదు. అమిత్ షాను, నడ్డాను నమ్మవద్దు.. మీరు మా పార్టీలోకే వచ్చేయండి.. అని రేవంత్ రెడ్డి వారికి పిలుపు ఇచ్చారు. రేవంత్ ఇది ఏదో యథాలాపంగా అన్న మాట కాదని.. ఢిల్లీలో బిజెపి అధిష్ఠానంతో వారిద్దరి భేటీ అంత సవ్యంగా సాగలేదని, ఆ సమాచారంతోనే రేవంత్ పిలుపు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈటల, కోమటిరెడ్డి ఇద్దరూ పార్టీ పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కేవలం పదవులు మాత్రమే కాకుండా బిజెపి అనుసరిస్తున్న ధోరణులను వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మీద కేంద్రం తరఫునుంచి చర్యలుండాలని వారు కోరుతున్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ.. తర్వాత ఆమె మీద ఎలాంటి చర్య లేకపోవడానికి కూడా బిజెపి- బీఆర్ఎస్ తో కుమ్మక్కు కావడమే కారణమని ఆ ఇద్దరు నమ్ముతున్నట్టుగా ఉంది. అందుకే వారు ఢిల్లీ పర్యటనలో కూడా అమిత్ షా, నడ్డాలతో కేసీఆర్ సర్కారు మీద చర్యలు గురించి పట్టుబట్టినట్టుగా మీడియాకు చెప్పారు.

తమకు ప్రజలు ముఖ్యం అని, పార్టీ ఆ తర్వాతేనని, ప్రజల కోసం- కేసీఆర్ సర్కారును ఓడించడానికి బిజెపి కట్టుబడి ఉన్నదని ఇంకా నమ్ముతున్నాం అని వారు అంటున్నారు. ఈ మాటలన్నీ కూడా నర్మగర్భంగా సాగిపోతున్నాయి. అయితే ఆదివారం నాడు నాగర్ కర్నూల్ లో బిజెపి సంకల్పించిన భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ సారథి జెపి నడ్డా హాజరవుతున్నారు. శనివారం రాత్రి ఆయనతో భేటీ అయిన ఈటల, కోమటిరెడ్డి ఈ సభకు హాజరు కావడం లేదు. దీనిని బట్టి.. ఢిల్లీ భేటీలు అంత సవ్యంగా సాగలేదని పలువురు భావిస్తున్నారు. చూడబోతే.. ఈటల, కోమటిరెడ్డి పార్టీ అధిష్ఠానం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారని, డెడ్ లైన్ లోగా అవి తీరకపోతే.. కాంగ్రెస్ లోకి వెళ్లవచ్చునని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles