ధర్మాన ప్రసాదరావు తాను ఉత్తరాంధ్ర జాతిపితగా అవతారం ఎత్తదలచుకున్నారు. ఎటొచ్చీ వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేని ధర్మాన ప్రసాదరావు.. తన నోటికి ఏం వస్తే అది మాట్లాడేస్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టాల్సిందేననే ఆయన మాట పాతపడిపోయింది. తాజాగా ప్రజలనుంచి వసూలుచేసిన పన్నుల డబ్బులతో అమరావతిలో అభివృద్ధి పనులు చేపడితే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని అంటున్నారు. ఆయన ప్రదర్శిస్తున్న ఈ సంకుచిత బుద్ధి యావత్ ఉత్తరాంధ్రకే శాపంగా మారే అవకాశం ఉన్నదని ఆ ప్రాంత మేధావులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తానేదో ఉత్తరాంధ్రను ఉద్ధరించేస్తున్నట్టుగా ప్రజల వద్ద మార్కులు కొట్టేయాలన్నది ధర్మాన ఆలోచన ఒక ప్రాంతాన్ని ఉద్ధరించడం అంటే.. విశాఖలో రాజధాని పెడితే చాలు.. ఇంకేమీ చేయక్కర్లేదు అనే తరహా మాయమాటలతో ఆయన ప్రజలను వంచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల మాట అంటోంటే.. మూడు రాజధానులు అంతా ఉత్తుత్తివే.. విశాఖ ఒక్కటే అసలైన రాజధాని.. మిగిలినవంతా ఉత్తుత్తివే.. ఏదో అసెంబ్లీ ఉన్నప్పుడు అమరావతికి నాల్రోజులు వెళ్లొస్తాం.. కోర్టుకేసులతో పనిఉండే నేరస్తులు కర్నూలుకు వెళ్తారు తప్ప మరొకటి కాదు అంటూ చులకన వ్యాఖ్యలు చేసి ధర్మాన ప్రసాదరావు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమూ చేశారు.
విశాఖను తక్షణం పరిపాలన రాజధానిగా ప్రకటించి.. అక్కడినుంచి కార్యకలాపాలు ప్రారంభించకపోతే.. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసి ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తానని.. అతిశయంతో కూడిన డైలాగులను కూడా వల్లించారు. మంత్రి పదవి తనకు తూచ్ అన్నారు. విశాఖను రాజధానిగా చేయకపోతే అసలు ఉత్తరాంధ్రను వేరే రాష్ట్రంగా చేసేయాలంటూ.. వేర్పాటువాద ధోరణుల్ని కూడా వినిపించారు. ప్రతి దశలోనూ ధర్మాన ప్రసాదరావు.. తన సంకుచిత బుద్ధులను బయటపెట్టుకున్నారే తప్ప, ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండగల విశాల దృక్పథపు యోగ్యతను చూపించలేకపోయారు.
అలాంటి ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టడం గురించి మాట్లాడుతున్నారు. అసలే జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. అక్కడ అదివరలోనే మొదలైన వేల కోట్ల రూపాయల నిర్మాణ పనులు సమస్తం పడకేశాయి. అంతా అగమ్యగోచరంగా మారుతోంది. ఇలాంటి సమయంలో.. అమరావతిలో ప్రజాపన్నుల డబ్బుతో అభివృద్ధి చేస్తే ఊరుకునేది లేదని ఆయన అంటున్నారు. ప్రభుత్వం ఎక్కడైనా సరే.. ప్రజల పన్నులతో కాకుండా ఏ డబ్బులతో అభివృద్ధి చేస్తుంది? ఇలాంటి మౌలిక మైన సంగతి తెలియకుండా.. ఈ మేధావి నాయకుడు ఇన్నాళ్లుగా ఇంత సీనియర్ మంత్రిగా ఎలా చెలామణీ అవుతున్నారు. ఇదే ప్రభుత్వం విశాఖలోనే రాజధాని అభివృద్ధి చేయదలచుకుంటే.. అప్పుడైనా ప్రజాపన్నుల సొత్తుకాకుండా వేరే డబ్బు పెడతారా? మాజీ సైనికులకు ఇచ్చిన భూములను ఆక్రమించిన ఘనచరిత్ర ఉన్న ధర్మాన ఆ భూములను అమ్మి ఆ సొమ్ములతో రాజధాని కడతారా? అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
ధర్మాన సంకుచిత బుద్ధి ఉత్తరాంధ్రకు శాపం!
Wednesday, January 22, 2025