వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ముఠా రాజకీయాలు ముదిరి రోడ్డున పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అసామాన్యమైన ప్రజాదరణ ఆ నియోజకవర్గంలో ఉటే తప్ప.. ప్రజలకు చీదర పుట్టించే ఈ వ్యవహారాలతో వాళ్లు వచ్చే ఎన్నికల్లో నెగ్గుకురావడం చాలా కష్టం. అంతగా ఒకరినొకరు పరువు తీసుకోవడం మాత్రమే కాదు. పార్టీ పరువు పోయేలా వ్యవహరిస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి.. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండగా మొదలుపెట్టిన పనులు కూడా ఇప్పటిదాకా పూర్తి కావడం లేదని, ప్రజల ఎదుట సమాధానం చెప్పలేకపోతున్నామని పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే సహజంగానే ఈ ధిక్కార స్వరాల పట్ల పార్టీ గుర్రుగా ఉంటుంది. ఆనం స్థానంలో నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డిని ఇన్చార్జిని చేశారు. సహజంగా ఎమ్మెల్యే ఇక మీదట రెచ్చిపోకుండా, నియోజకవర్గంలో ఆయన మాట సాగకుండా, ఆయన ప్రభావంలో పడి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు ఆయననే అంటిపెట్టుకుని ఉండకుడా చూడడమే ప్రత్యామ్నాయ ఇన్చార్జి పని. ఎమ్మెల్యే మాట అధికారుల వద్ద చెల్లకుండా చేసి, నియోజకవర్గంలో పనులన్నీ తమ కనుసన్నల్లో నడిచేలా ఈ ఇన్చార్జిలు చూసుకుంటారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో ఎటొచ్చీ సిటింగ్ ఎమ్మెల్యేను లూప్ లైన్లోనే పెడుతున్నారు గనక.. తనకు టికెట్ ఇస్తారు గనుక, తను నెగ్గేలా తనకు అనుకూల వాతావరణం అధికారుల ద్వారా ప్రజల్లో సృష్టించుకుంటారు. ఇదీ సాధారణ స్కెచ్.
రాంకుమార్ రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి.. ఆనం రాంనారాయణ రెడ్డి మీద ఇంకా బోలెడు నిందలు వేస్తున్నారు. బహుశా ఆయన ఇతర నియోజకవర్గాలకు వెళ్లినా కూడా గెలిచే అవకాశం లేకుండా చేయాలని, ప్రజల్లో ప్రతికూలత సృష్టించాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ.. ఆనం పనితీరు, అవినీతి మీద నిందలు వేస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి అందరినీ మభ్యపెట్టి దోచుకున్నారని రాంకుమార్ రెడ్డి ఆరోపిస్తుండడం విశేషం. అయితే రాంకుమార్ ఆరోపణలు వింటున్న వారికి కలుగుతున్న సందేహం ఒక్కటే. ఆనం దోచుకోవడం అనేది హఠాత్తుగా నిన్నా మొన్నా జరిగిన వ్యవహారం కాదు కదా. దోచుకోవడం అన్నది నిజమైతే గత నాలుగేళ్లుగా అది జరుగుతూనే ఉండిఉండాలి. అలాంటి నేపథ్యంలో ఇన్నాళ్లూ ఆనం దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు అనుమతించినట్టు? అంటే తమ పార్టీకి అనుకూలంగా, తమ ముఖ్యమంత్రికి భజన చేస్తూ ఉన్నంత కాలం ఎంత దోచుకున్నా పరవాలేదని మిన్నకున్నారా? ఇప్పుడు అభివృద్ధి లేదని ఆనం విమర్శలు చేయడం మొదలయ్యాక.. వైసీపీ పెద్దలకు ఆయన చేసిన అవినీతి, సాగించిన దోపిడీ హఠాత్తుగా కనిపిస్తున్నాయా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వృద్ధ నారీ పతివ్రతః సామెతను గుర్తుకు తెచ్చే విధంగా.. నాలుగేళ్ల దోపిడీని అనుమతించి ఇప్పుడు ఆనం మీద నిందలు వేస్తున్న రాంకుమార్ రెడ్డి చిత్తశుద్ధి నిజాయితీలను నమ్మడం ఎలా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
దోచుకుంటూ ఉంటే.. తమరు కాపలా కాస్తున్నారా?
Sunday, December 22, 2024