ఎన్నికల పర్వం అంటూ వస్తే ఎన్ని రకాలుగా తాము అరాచకాలకు, అక్రమాలకు పాల్పడగలమో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రత్యర్థి పార్టీల వారు అసలు నామినేషన్లే వేయకుండా అడ్డుకోవడం, వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేలా వక్రమార్గాలు అనుసరించడం లాంటి పనులతో అధికార పార్టీ చెలరేగిపోయిన సంగతి అందరికీ తెలుసు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పోటీ అనివార్యం కావడంతో.. దొంగఓట్లను నమోదు చేయించడం ద్వారా.. వక్రమార్గాల్లో మరో పరాకాష్టకు తెరతీసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా వేల సంఖ్యలో దొంగఓటర్లను నమోదు చేయించినట్లుగా చాలారోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. సోమవారం నాటి ఎన్నికల సందర్భంగా.. ఈ దొంగఓటర్ల ప్రహసనాలు బట్టబయలయ్యాయి.
అసలు జరుగుతున్నది ఏం ఎన్నికలో కూడా తెలియకుండా ఆరోక్లాసు, ఏడోక్లాసు చదువుకున్న వాళ్లు చేతుల్లో స్లిప్పులు పట్టుకుని వచ్చి ఓట్లు వేసిన సంఘటనలు టీవీ ఛానళ్ల సాక్షిగా బయటపడ్డాయి. తిరుపతి మంచినీళ్ల గుంట ప్రాంతంలో మహిళలు చాలా అమాయకంగా టీవీ చానెల్ రిపోర్టరు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం చూసేవాల్లను విస్తుగొలిపింది.
‘‘మా వార్డులో ముగ్గురు ఆడోళ్లను ఎన్నిక చేసినారు సార్.. మీరు ఎన్నికైనారు.. మీరు వచ్చి ఓట్లు వేయాల. అని చెప్తే మేం వొచ్చాం సార్.. మేం ఆరుగురు ఆడోళ్లం వచ్చాం సార్.. మాకు మూడురోజుల ముందరే స్లిప్పులు ఇచ్చినారు సార్. ఓటు మాకు ఎప్పుట్నుంచో ఉండాది సర్..’’ అని అమాయకంగా వారు చెబుతున్న మాటలు.. పట్టభద్ర ఓటర్ల నమోదు అనేది ఎంత నీచంగా, ప్రహసనప్రాయంగా జరిగిందో తెలియజేస్తోంది. కొన్ని ఉదాహరణలు ఛానెళ్లలో వచ్చాయి. కానీ, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి.
పట్టభద్ర ఎన్నికల్లో దొంగఓట్ల గురించి ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఓటర్ల నమోదు సమయంలోనే వాలంటీర్లను కూడా వాడుకుంటూ తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి పేర్లను, వారు డిగ్రీ చదవకపోయినా సరే నమోదు చేయిస్తూ.. అదే తమకు వ్యతిరేకంగా ఉండే ఓటర్లు డిగ్రీ చదివినా సరే.. వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేలా చక్రంతి ప్పుతూ అన్ని రకాల తప్పుడు పనులకూ అధికార పార్టీ పాల్పడినట్లుగా ఇప్పుడు వెలుగుచూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసే ఎన్నికలుగా ఇవి మారిపోయినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డిగ్రీ చదవని వారు వచ్చి ఓట్లు వేస్తే వారిని అరెస్టు చేస్తామని, కఠిన శిక్షలు ఉంటాయని కలెక్టరు ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు చాలా డాంబికంగా ప్రకటించారు. కానీ అసలు తాము ఏ ఎన్నికల్లో ఓటు వేస్తున్నామో కూడా తెలియకుండా వచ్చి ఓట్లు వేసిన అమాయకులు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ ఎన్నికలను రద్దు చేస్తుందా. ఇంకేమైనా చర్యలు తీసుకుంటుందా? అనేది వేచిచూడాలి.