తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పంచన చేరి, పార్టీ కండువా కప్పుకోకుండా రాజకీయ మనుగడ సాగిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజకీయాలలో విలువలు, పరుషపదజాలం లాంటి పదాలు, ప్రత్యేకించి నాయకులు విమర్శలలో చేసే క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. బయట ప్రాంతాల నాయకులు తన నియోజకవర్గానికి వచ్చి, తన గురించి పరుష పదజాలంతో విమర్శలు చేస్తే స్థానికులు ఎందుకు ఊరుకుంటారు? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ విమర్శలలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదు కదా అని ఉపదేశాలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ నోటి వెంట ఇలాంటి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వల్లభనేని వంశీ.. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ పిమ్మట జగన్ పంచన చేరారు. అది మొదలుగా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడును ఎడాపెడా విమర్శించడానికి ఆయన వారికి ఉపయోగపడుతున్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వల్లభనేని వంశీ రాజకీయ ప్రస్థానం అంత సుఖంగా ఏమీ లేదు! సొంత నియోజకవర్గంలో ఆల్రెడీ ఆ పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయి. వారిద్దరి మధ్యనే కీచులాటలు ఉన్నాయి. మూడో కృష్ణుడి లాగా ముఠాల్లోకి వల్లభనేని వంశీ కూడా అక్కడ రంగ ప్రవేశం చేశారు. వారిద్దరి అసమ్మతి కార్యకలాపాలతోనే వేగలేక ఆయన తరచుగా అసహనానికి గురువుతూ ఉంటారు. సిటింగ్ ఎమ్మెల్యే గనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు మళ్ళీ టికెట్ తప్పక ఇస్తుందనే నమ్మకంతో సాగుతున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి.. చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను అడ్డగోలుగా తిట్టిపోయడం ఒక మార్గంగా ఎంచుకున్న వ్యక్తి వల్లభనేని వంశీ!
ప్రస్తుత రాజకీయాల్లో కేరక్టర్ అసాసినేషన్ అనే పదాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లి, అత్యంత నీచమైన, లేకి విమర్శలు చేయడం ద్వారా.. కొన్ని నెలల పాటు వార్తల్లో నిలిచిన వ్యక్తి వల్లభనేని వంశీ. నారాలోకేష్ తల్లి గురించి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా.. వల్లభనేని వంశీ రాజకీయవిమర్శలను జుగుప్సాకరంగా మార్చేశారు. ఆయన అందించిన లేకి విమర్శలను పట్టుకుని.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులందరూ రెచ్చిపోయి.. అవే పదేపదే అనడంతో చంద్రబాబునాయుడు సభ నుంచి వెళ్లిపోయి ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వంశీ మాటలు గమనించిన ప్రతిఒక్కరూ.. రాజకీయాల్లో ఉంటే మరీ ఇత నీచమైన విమర్శలు చేస్తారా? అని పార్టీ రహితంగా అసహ్యించుకున్నారు.
అలాంటి వల్లభనేని వంశీ.. ఇవాళ టీడీపీ నాయకులు తన గురించి మాట్లాడిన మాటలకు అలిగి వారి మీద దాడి చేయించారు. తన నియోజకవర్గంలోని టీడీపీ ఆఫీసును ధ్వంసం చేయించారు. వారి వాహనాలను తగులబెట్టించారు. ఇదేంటని మీడియా అడిగితే.. వేరే ఊరినుంచి ఎవరో నాయకులు మా ఊరికొచ్చి నా మీద విమర్శలు చేస్తే మా ఊరి వాళ్లు ఊరుకుంటారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.అందుకే.. ఆయన తన కేరక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడారని అనడాన్ని గమనిస్తే.. ఎవరికైనా అసహ్యం పుడుతుందని ప్రజలు అంటున్నారు.