ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత.. అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులను దువ్వడానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకుంటున్నారు. దువ్వడం ప్రత్యేకంగా మరొకటేమీ కాదు.. వారికి కాస్త ఘనంగా అనిపించే పదవులు కట్టబెట్టేయడం మాత్రమే. ఈ ప్రభుత్వం ఇంకా బతికి ఉండేది మూడు నెలల ముచ్చటే అయినప్పటికీ.. మళ్లీ గెలవబోయేది మనమే.. ఆ ప్రభుత్వంలో కూడా మీకు ఈ పదవి కొనసాగుతుంది.. అనే మాటలు చెప్పి కేసీఆర్ వారిని ఒప్పించగలుగుతున్నారు. ఆ క్రమంలో భాగంగా.. వేములవాడ సీటును ఆశించి భంగపడిన సిటింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు కేసీఆర్ కీలకమైన పదవిని కట్టబెట్టారు.
కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా చెన్నమనేని రమేశ్ ను ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో ఆయన అయిదు సంవత్సరాలపాటు కొనసాగుతారని ప్రకటించారు. రమేశ్ స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త కూడా. ప్రతిష్ఠాత్మక హంబోల్డ్ యూనివర్సిటీనుంచి ఆయన అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో పరిశోధనలు చేసి పిహెచ్.డి. పట్టా పొందారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న సమయంలో.. రమేశ్ వంటి వారి సలహాలు, ఆ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలవనే నమ్మకంతోనే పదవిని కట్టబెడుతున్నట్టుగా పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల అయిన తర్వాత అసంతృప్తి చాలా మంది నాయకుల్లో చెలరేగింది. కానీ పార్టీకి ముఖ్యులని అనుకున్న వారి విషయంలో కేసీఆర్ కాస్త మెతకధోరణి అవలంబిస్తున్నారు. వారు అలిగినా సరే.. బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాండూరు టికెట్ ఆశించి భంగపడిన పట్నం మహేందర్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మంత్రిని చేసేశారు. భారాస ప్రభుత్వం మళ్లీ వచ్చినా సరే.. ఆయనకు ఆ మంత్రి పదవి ఉంటుందో లేదో తెలియదు గానీ.. ప్రస్తుతానికి ఆయనను సంతుష్టులను చేయగలిగారు. అలాగే వేములవాడకు చెందిన చెన్నమనేని విషయంలో కూడా వ్యవహరించారు.
రమేశ్ అనుచరులు జాబితా చూసుకుని తీవ్రంగా ఆవేదనకు గురయ్యారు. అయితే చెన్నమనేని రమేశ్ మాత్రం వారెవ్వరినీ దూకుడుగా వ్యవహరించవద్దని ముందే చెప్పారు. తన అసంతృప్తిని ఆయన ఫేస్ బుక్ పోస్టులో తన తండ్రి మాటల రూపంలో.. ‘రాజకీయాలను ప్రజలకోసం చేయాలి తప్ప పదవులకోసం కాదు’ అన్నట్టుగా ఒక పోస్టు పెట్టారు. కేసీఆర్ ఆయనను బుజ్జగించే ప్రయత్నంలో ఏకంగా కేబినెట్ ర్యాంకుతో సలహాదారు పోస్టు కట్టబెట్టారు.