దీన్ని భయం అనాలా? దాదాగిరీ అనాలా?

Friday, November 15, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన భయాందోళనలతో పాలన సాగిస్తోంది. చీమ చిటుక్కుమంటే భయం. తెలుగుదేశం కార్యక్రమం జరిగితే భయం. పవన్ కల్యాణ్ సభ ఉన్నదంటే భయం. చివరికి సీపీఐ వాళ్లు చిన్న పాదయాత్ర చేస్తామని ప్రకటించినా కూడా ప్రభుత్వానికి భయమే. ఇంతటి భయంలో బతుకుతూ.. వారు పాలన మాత్రం ఏం సవ్యంగా నడిపించగలరు? రాష్ట్రానికి కొత్తగా ఏ దశ దిశ నిర్దేశించగలరు?
అధికారపార్టీలో చెలరేగుతున్న భయానికి ఒక మచ్చుతునక లాంటి ఉదాహరణ ఇది..
సాధారణంగా పార్టీలు.. ఓటర్ల జాబితాలాంటి వివరాలను కంప్యూటరైజ్ చేసుకుని తమ అవసరాల ప్రకారం వాటిని వర్గీకరించుకుని వాడుకోవాలని అనుకుంటుంది. అందుకోసం ప్రతి నియోజకవర్గంలో లేదా ప్రతి జిల్లాల్లో కొందరు కుర్రాళ్లను స్థానికంగా నియమించుకుని వారికి జీతం ఇస్తూ వారి సేవలను వాడుకుంటుంది. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. చిన్న పార్టీలు కూడా ఇలాంటి పని చేస్తుంటాయి. నిజం చెప్పాలంటే ఇండిపెండెంట్లు కూడా ఎన్నికల సమయంలో సీరియస్ గా పోటీచేసే రకాలైతే ఇలాంటి ప్రయత్నం చేస్తారు.
అంతమాత్రాన.. వారి వారి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది వారి పార్టీ కార్యకర్తలని అర్థం కాదు. వారు కేవలం నిరుద్యోగులు. డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పని దొరికితే చేసుకుంటూ ఉంటారు.. అంతే! కానీ.. వైసీపీ వ్యవహారం ఎలా ఉన్నదంటే.. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో డేటా ఎంట్రీకి పనిచేసే సిబ్బంది మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. డేటా ఎంట్రీ చేసేవాళ్ల కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తున్నారు.
తెలుగుదేశం సోషల్ మీడియా టీమ్ లలో పనిచేస్తూ ఉండేవాళ్లను టార్గెట్ చేయడంలో కాస్త అర్థముంది. అది నిజానికి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా టీం లలో పనిచేయాలంటే.. భయంకరమైన పార్టీ ముద్ర ఉన్న వారు తప్ప మరొకరు ముందుకు రావడం లేదు. తటస్థులనే ముద్ర ఉన్న వారు అస్సలు ఆ జోలికే వెళ్లడం లేదు. చివరికి వైసీపీ వాళ్లు టీడీపీ ఆఫీసులో డేటా ఎంట్రీ చేసేవాళ్లను కూడా వదలడం లేదు. ఎవరెవరు అక్కడ పనిచేస్తున్నారో తెలుసుకుని.. వారి కుటుంబాలను సంప్రదించి.. మీ పిల్లల్ని తెలుగుదేశం ఆఫీసులో పనిచేయడం మానుకోమని చెప్పండి.. అని చెబుతున్నారు. ఆ కుటుంబం.. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబమే అయితే గనుక.. ఆ పథకాలన్నీ ఆగిపోతాయనే బెదిరింపును కూడా జారీచేస్తున్నారు. వారు అక్కడ ఉద్యోగం మానేసేలా చేస్తున్నారు.
టీడీపీ అంటే భయం ఉండొచ్చు.. టీడీపీ ఆఫీసులో ఎవ్వరూ పనిచేయనే కూడదు అని అధికార పార్టీ కోరుకుంటే ఎలా? ఒకరిద్దరు ఉద్యోగులు టీడీపీ కోసం పనిచేయకుండా చేసినంత మాత్రాన.. ఆ పార్టీని అడ్డుకోగలమని అధికార పార్టీ భ్రమపడుతోందా? ఏమోమరి?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles