దబాయించగలరు గానీ, తప్పించుకోలేరు!

Friday, November 15, 2024

‘వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన నిందితులు, సూత్రధారులు- తమ నేరం బయటపడే వరకు దర్యాప్తు సంస్థల మీద నిందలు వేస్తూ, తమ రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కు అయినట్లుగా ఆరోపణలు గుప్పిస్తూ, వారిని బెదిరించగలరు! కానీ తద్వారా తాము చేసిన నేరం నుంచి తప్పించుకోలేరు!!’ అనే అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది. స్వయంగా హత్య చేసిన వారిలో ఒక నిందితుడు అప్రూవరుగా మారి అందించిన వివరాలతో పాటు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని గూగుల్ టేక్ అవుట్ ద్వారా సమన్వయ పరిచిన వివరాలను కూడా సిబిఐ కోర్టు ముందు పెడుతుండడంతో నిందితులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. నేరం నిరూపణ అయ్యేదాకా వారు ఎంతైనా దబాయించగలరని, ఆ తర్వాత నిశ్శబ్దంగా శిక్ష అనుభవించాల్సిందే అని అంచనాలు సాగుతున్నాయి.

‘స్వయంగా తాను హత్యలో పాల్గొన్నాను’ అని చెప్పిన నిందితుడినే అప్రూవర్‌గా మార్చవలసిన అవసరం ఏమొచ్చిందని’ అవినాష్ రెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది! నిజానికి ఇది తర్కానికి నిలబడే ప్రశ్న కానే కాదు! ఎందుకంటే నేరం చేసిన వాడు- అందుకు దారితీసిన, ప్రేరేపించిన కారణాల గురించి విచారణకు ముందు వెల్లడి చేయడానికి ఒప్పుకుంటేనే అతడిని అప్రూవర్ అని అంటారు. ఎవరో దారిన పోయే దానయ్య నుంచి వివరాలు సేకరించి వాటి ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తే అతనిని సాక్షి అంటారు తప్ప అప్రూవర్ అనరు. ఈ ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా వైయస్ అవినాష్ రెడ్డి వర్గీయులు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు.

‘సిబిఐ- దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మీద కొంత ఆధారపడిందే తప్ప, అదొక్కటే తమ వద్ద ఉన్న సాక్ష్యంగా కేసును ముందుకు తీసుకువెళ్లడం లేదు’ అనే సంగతిని వాళ్లు గ్రహించడం లేదు! 

అదే సమయంలో గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిందితులు సంచరించే ప్రాంతాల ను సమన్వయం చేసి వారి కదలికలను బట్టి అవినాష్ రెడ్డి పాత్రను నిర్ధారించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని వారు ఆమోదించలేకపోతున్నారు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సమర్పించే సాక్ష్యాలు ఆధారాలు సుప్రీంకోర్టు కూడా ఆమోదిస్తున్నవే అనే విషయం బహుశా వారికి తెలిసి ఉండకపోవచ్చు.

అందుకనే ముందు ముందు పరిణామాలు తమకు ప్రతికూలంగా ఎలా వికటిస్తాయనే స్పృహ లేకుండా అవినాష్ రెడ్డి వర్గీయులు దర్యాప్తు సంస్థ సిబిఐ మీద విరుచుకుపడుతున్నారు. ‘‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా సిబిఐ పనిచేస్తున్నది’’ అని వ్యాఖ్యానించడం వారి తర్కరహితమైన నిందలకు పరాకాష్ట. సిబిఐ మాత్రం తమ వద్ద సంపూర్ణమైన సాక్షాధారాలు ఉన్నాయి అనే విశ్వాసంతో ఎలాంటి దబాయింపులకు జడుచుకోకుండా, బెదిరింపులను పట్టించుకోకుండా నింపాదిగా తమ పని తాము చేసుకుపోతున్నది!

 మరికొన్ని రోజుల వ్యవధిలోనే వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సస్పెన్స్ మొత్తం తొలగిపోతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles